సుమలతకు భారీ స్పందనతో కుమారస్వామి ఖంగారు!

కర్ణాటకలో మండ్య నుంచి స్వతంత్ర అభ్యర్థిగా సుమలత నామినేషన్‌ పర్వానికి భారీ స్థాయిలో జనం తరలిరావడంతో జేడీఎస్ కు గుబులు పుట్టుకుంది. జేడీఎస్‌ నేతలు, సుమలతల మధ్య మూడు రోజులుగా మాటల యుద్ధం సాగుతున్నది. నామినేషన్‌ సీదాసాదాగా సాగుతుందని సీఎం కుమారస్వామి భావించారు. అయితే ఒక్కసారిగా పెద్ద ఎత్తున జనం రావడంతో ముఖ్యమంత్రి కుమారస్వామి ఖంగుతిన్నారు.

దీనికితోడు సుమలత సెంటిమెంట్‌ ప్రసంగం, ఎన్ని ఆపదలు వచ్చినా అమ్మ సుమలతకోసం వెంటే ఉంటామని స్టార్‌ హీరోలు దర్శన్‌, యశ్‌లు మండ్య వేదికపై తొలిసారి ప్రకటించడంతో ప్రతిక్షణం ఉత్కంఠ అనిపించేలా సభ సాగింది. సుమలతకు మద్దతుగా వచ్చిన జనస్పందన కేవలం మండ్యకే పరిమితం కాకుండా రాష్ట్రమంతా తీవ్రమైన చర్చకు కారణమైంది.

‘నేను రెబల్‌స్టార్‌ అంబరీశ్‌ భార్యగా ఇక్కడి ప్రజలతో జీవితకాలం కలసి ఉండాలనే ఆయనతో మండ్యకు వచ్చా. నన్ను ఆశీర్వదించండి’ అంటూ సుమలత నిమినేషన్ దాఖలు సందర్భంగా చేసిన ప్రసంగం రాష్ట్రం అంతా ఆసక్తి కలిగిస్తున్నది. ఆమె వెంట కుమారుడు అభిషేక్‌, స్టార్‌ హీరోలు దర్శన్‌, యశ్‌లతోపాటు నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేశ్‌లు ఉన్నారు. నామినేషన్‌ దాఖలు తర్వాత మండ్యలో భారీ బహిరంగసభ జరిగింది. మండ్యలో ఇటీవల కాలంలో ఎన్నడూ ఊహించనంతగా ప్రజలు తరలివచ్చారు.

బహిరంగసభ ప్రసారాల వేళ విద్యుత్‌కోత, కేబుల్‌ ప్రసారాలు స్తంభించడం వెనుక జేడీఎస్‌ నేతల హస్తం ఉందనే పలువురు సుమలత అభిమానులు ఆగ్రమం వ్యక్తం చేశారు. సుమలత నామినేషన్‌కు ప్రజలు తరలిరాకుండా సీఎం కుమారస్వామి భారీ వ్యూహమే పన్నారు. మంగళవారం రాత్రి కెఆర్‌ఎస్ లో మకాం వేసి ఎమ్మెల్యేలు, మంత్రులతో చర్చలు జరిపారు. అయినా భారీగా జనం రావడంతో సీఎం ఇంటెలిజెన్స్‌తో ఆరాతీశారు.

సుమలత నామినేషన్‌ కార్యక్రమంలో ఎవరూ పాల్గొనరాదని ఇటు కాంగ్రెస్‌, అటు జేడీఎస్‌ పార్టీ అగ్రనేతలు హెచ్చరికలు జారీ చేసినా జిల్లా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి మంజునాథ్‌తోపాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహిరంగసభలో సుమలత కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ, తాను రాజకీయాలే జీవితాశయంగా భావించలేదని, ప్రజాసేవే లక్ష్యంగా పెట్టుకున్న అంబరీశ్‌ ఆశయాలకోసమే లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేస్తున్నానని వెల్లడించారు. తనకు కు పదవులకంటే ప్రజలే ముఖ్యమని చెబుతూ ఒకప్పుడు కావేరీ సమస్య కోసం తన భర్త అంబరీష్ కేంద్రమంత్రి పదవిని వదిలేశారని ఆమె గుర్తు చేశారు.

జేడీఎస్‌ ముఖ్యనేతలు ఆమె వెంట ఎవరు వెళ్లారని ముఖ్యమంత్రి ఆరా తీసినట్లు తెలిసింది. స్టార్‌ హీరోలు మండ్యలో ప్రచారాలకు వచ్చినంత మాత్రాన భయపడేదిలేదని సంకీర్ణపార్టీల అభ్యర్థి నిఖిల్‌ కుమారస్వామి ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కుమారుడు నిఖిల్ ఇక్కడి నుండి పోటీ చేస్తున్నారు. దానితో కాంగ్రెస్ కు ఈ సీట్ దక్కక పోవడంతో సుమలత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

ఎన్నికలలో పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ టికెట్‌ ఇవ్వకపోగా తమకు మద్దతు ఇచ్చేవారిని బెదరిస్తున్నారని ఇదెక్కడి నీచమని సుమలత మండిపడ్డారు. దర్శన్‌, యశ్‌లు సినీరంగంలో టాప్‌ హీరోలని వారిద్దరు తమకు బిడ్డల్లాంటివారని ఆమె చెప్పారు.  వారిద్దరినీ బెదిరించేందుకు జేడీఎస్‌ నేతలు సిద్ధమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మా బిడ్డలు కూడా మాకోసం పనిచేయకూడదా..?’ అని ప్రజలను ప్రశ్నించగా సభలో ఒక్కసారిగా ఆమెకు అనుకూల నినాదాలు హోరెత్తాయి.

గత సంవత్సరం మరణించిన రెబల్‌స్టార్‌ అంబరీశ్‌గతంలో ఈ నియోజకవర్గం నుండి మూడు సార్లు గెలువపొందారు. కొంతకాలం యుపిఎ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. కాగా,  సినీ హీరోలు తమ వైఖరిని ఇలాగే కొనసాగిస్తే తగిన గుణపాఠం చెప్పాల్సి ఉంటుందన్నారు. నటుల అక్రమాల జాతకాలను వెలికితీయాల్సి ఉంటుందని

జేడీఎస్‌ ఎమ్మెల్యే నారాయణ గౌడహెచ్చరించారు. కన్నడ నటులు గౌరవంగా వారి ఇళ్ళల్లో ఉండాలని చెబుతూ ప్రచారం పేరిట జేడీఎస్‌, నాయకులను విమర్శిస్తే బాగుండదని స్పష్టం సహసారు. రాజకీయాలకు ఆ హీరోలు దర్శన్‌, యశ్‌లకు ఏం సంబంధమని ప్రశ్నించారు.