అసెంబ్లీ రద్దుపై త్వరలోనే కెసిఆర్ నిర్ణయం

హైదరాబాద్ శివారులో కొంగరకలాన్ వద్ద భారీ స్థాయిలో జరిపిన  ప్రగతి నివేదన సభలో టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అందరూ ఉహించిన్నట్లు అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికల గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు. పైగా ప్రజలను ఆకట్టుకోవడం కోసం ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే ప్రత్యేకంగా కొత్త పధకాలను కుడా ప్రకటించలేదు. అయితే ఈ విషయమై త్వరలోనే రాజకీయ నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు చెప్పడం ద్వారా ముందస్తు ఎన్నికలకు స్పష్టమైన సంకేతం ఇచ్చారు.

శాసనసభ రద్దుకు సంబంధించి, ముందస్తు ఎన్నికలకు సంబంధించి ఈ సభలో తాను ప్రకటన చేయనున్నట్లు మీడియాలో, రాజకీయ వర్గాలలో కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయని తన ప్రసంగం చివరిలో కెసిఆర్ స్వయంగా ప్రస్తావించారు. పైగా, రాజకీయంగా తెలంగాణకు, టీఆర్‌ఎస్‌కు, ప్రజలకు  ఏది మంచిదో ఆ నిర్ణయం తీసుకుంటామని మంత్రివర్గం, పార్టీ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, ఎంపిలు తనకు బాధ్యత అప్పచెప్పారని కుడా గుర్తు చేసారు.

వారి నిర్ణయానుసారం త్వరలోనే రాజకీయ నిర్ణయం తీసుకుంటానని, ప్రజలకు చెబుతానని ప్రకటించారు. పైగా ముఖ్యమంత్రిగా ఉంది బహిరంగ సభలో కొత్త పధకాలను ప్రకటించాలేనని చెబుతూ తిరిగి తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏమేమి చేయాలో సూచించే విధంగా పార్టీ ఎన్నికల ప్రణాళికను తయారు చేయడం కోసం త్వరలోనే ప్రతి సెక్రటరీ జనరల్ కేశవరావు అద్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు కుడా ప్రకటించారు.

అధికారం చేపట్టి 51 నెలలు పూర్తయిన సందర్భంగా తమ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించడం మినహా కొత్త అంశాలు ఏమీ ప్రస్తావించనే లేదు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నంతవరకు రైతు బంధు, రైతు భీమ వంటి పధకాలు కొనసాగుతాయని, అట్లాగే హామీ ఇచ్చిన విధంగా కోటి ఎకరాలకు సాగు నీరు అందిస్తామని స్పష్టం చేసారు.

వచ్చే ఎన్నికల్లోపు మిషన్‌భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లు ఇవ్వకుంటే ఓట్లడగనని చెప్పానని అంటూ ఏ ముఖ్యమంత్రి ఇంత ధైర్యంగా చెప్పలేదని సీఎం కేసీఆర్‌ అన్నారు. 22 వేల గ్రామాలకు నీరు అందుతోందని, మరో 1500 గ్రామాలకు వారం పది రోజుల్లో తాగునీరు అందిస్తామని తెలిపారు. ఎన్నికలకు ముందే ఇంటింటికి గోదావరి, కృష్ణా నీళ్లు ఇస్తామని, మిషన్‌ భగీరథను అందరూ పొగుడుతున్నారని ఆయన గుర్తుచేశారు.

పాలమూరు జిల్లాలో 9 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు తెచ్చామని, వలస పోయిన పాలమూరు కూలీలు తిరిగి సొంతూళ్లకు వెళ్తున్నారని చెప్పారు. ఆర్థిక ప్రగతిలో దేశంలోనె ఇప్పుడు నెంబర్‌ వన్‌ రాష్ట్రం తెలంగాణ అని చెబుతూ  తెలంగాణ వృద్ధిరేటు 17.83 శాతంగా ఉందని కేసీఆర్‌ వెల్లడించారు.

ఉద్యోగాలలో స్థానికులకు 95శాతం ఉద్యోగాలు కావాలని ప్రధాని మోదీని నిలదీసి తెచ్చుకున్నామని తెలిపారు. కేసీఆర్‌ సీఎంగా లేకపోతే 95శాతం స్థానిక రిజర్వేషన్‌ సాధ్యమయ్యేదా అని ప్రశ్నించారు. ఇది యువత పట్ల తెరాసకు ఉన్న నిబద్ధత అని పేర్కొన్నారు.

రాష్ట్ర అభివృద్ధి కోసం తాను తపన చెందుతూ ఉంటె కేవలం కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యమని కొందరంటున్నారని, ఇదెక్కడి దిక్కుమాలిన లక్ష్యమని అంటూ ప్రతిపక్షాలను ఎండగట్టారు. కోర్ట్ లకు వెళ్లి సాగునీటి పధకాలకు అడ్డంకులు కల్పిస్తున్నారని దయ్యబట్టారు.