ఈడీ దెబ్బకు పట్టుబడుతున్న ఉగ్రసంస్థల సొమ్ములు

కశ్మీర్‌లో ఉగ్ర పుట్టలు పగలకొట్టే కొద్దీ  నిజాలు బయటకొస్తున్నాయి. ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాడులు చేసి కీలక ఆస్తులను అటాచ్‌ చేసింది. దీంతో ఇప్పుడా ఉగ్రనేతలకు ఊపిరాడటంలేదు. తాజాగా ఈడీ హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌కు చెందిన 13ఆస్తులను అటాచ్‌ చేసింది. వీటి విలువ 11 కోట్లకు పైగా ఉంటుంది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి హిజ్బుల్‌నేత సయ్యద్‌ సలాహుద్దీన్‌ పంపిన సొమ్ముతో వీటిని కొనుగోలు చేసినట్లు గుర్తించారు. 

కశ్మీర్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ప్రజలు సరిహద్దుల్లో వస్తుమార్పిడి పద్ధతిలో వ్యాపారం చేస్తుంటారు. దీనిని ఉగ్రవాదులు నిధులను తరలించేందుకు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఇటీవల ఈడీ గుర్తించిన రూ.11.26 కోట్లలో దాదాపు 10.5 కోట్లు ఈ మార్గంలో వచ్చినవే అని తేలింది. ఈ మార్గంలో డబ్బు తరిలించేవారు కశ్మీర్‌లోయలోకి నిధులను చేరుస్తున్నారు. అక్కడి నుంచి దేశంలోకి ఉగ్రవాదులకు వీటిని పంపిణీ చేస్తున్నారు. 

ఇటీవల ఎండీ షఫీ షా, మరో ఆరుగురికి చెందిన 13 ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకొంది. వీరిలో షా ఒక డాక్టర్‌. ఆయనే కశ్మీర్‌లోయలో నిధులను అందుకొని బందిపోరా, బుద్గాం, అనంతనాగ్‌ల్లో ఉగ్రవాదులకు పంపిణీ చేస్తాడు. 

లష్కరే తోయిబా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌కు  కశ్మీర్‌ లోయలో దాదాపు 25 చోట్ల ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. దీంతోపాటు గుడ్‌గావ్‌లో దాదాపు రూ. కోటివిలువైన ఆస్తి కూడా హఫీజ్‌కుంది. ఇవన్నీ ఆయన  బంధువులు, సన్నిహితుల పేర్లతో రిజిస్టరై ఉన్నాయి. వీటివిలువ దాదాపు రూ.7కోట్లుగా అంచనా వేశారు. ఈ సొమ్ము మొత్తం దుబాయ్‌, పాకిస్థాన్‌ నుంచి వచ్చినట్లు గుర్తించారు. 

కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ఎగదోసేందుకు నిధులు సమకూర్చేలా పాకిస్థాన్‌లో ఏకంగా ఒక ట్రస్ట్‌ ఉంది. దీనిని జమ్ముకశ్మీర్‌ ఎఫెక్టీస్‌ రిలీఫ్‌ ట్రస్ట్‌(జేకేఏఆర్‌టీ)గా వ్యవహరిస్తారు. ఈ ట్రస్ట్‌ నుంచే ఉగ్రవాదులకు సొమ్ములు అందుతాయి. ఇక భారత్‌లో  పాక్‌ హైకమిషన్‌ నుంచి కూడా భారీగా వేర్పాటు వాద నేతలకు నిధులు అందుతున్నాయి. వాటిని ఉగ్రకార్యక్రమాలకు కూడా మళ్లిస్తున్నట్లు ఈడీ అనుమానిస్తోంది. 

ఇటీవల గుర్తించి సొమ్ములో రూ.1.62కోట్ల నిధులు హఫీజ్‌ సయీద్‌, ఐఎస్‌ఐల నుంచి భారత్‌లోని పాక్‌ హైకమిషన్‌కు అక్కడి నుంచి కశ్మీరుకు చేరాయి. ఈ నిధులను అందుకున్న వారిలో హురియత్‌ నేత సయ్యద్‌ అలీషా గిలానీ అల్లుడు కూడా ఉన్నాడు. దీంతో ఇప్పుడు ఈడీ హురియత్‌ సంబంధాలను గుర్తించే పనిలో పడింది. 

ఇటీవలే హురియత్‌ నేత యాసిన్‌మాలిక్‌, షబ్బీర్‌ షాలకు కూడా రూ.63లక్షల మేరకు హవాలా నిధులు అందినట్లు తేలింది. దీనిని కూడా ఈడీ ఛేదించనుంది. ఇప్పటికే మాలిక్‌, షాలకు నోటీసులు జారీ చేసింది. షబ్బీర్‌ షా ప్రస్తుతం తీహాడ్‌ జైల్లో ఉన్నాడు.