బీజేపీలో `220 క్లబ్' మీడియా ఉహాగానమే !

లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ బలం తగ్గుతుందని, తద్వారా ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి ప్రత్యామ్నాయంగా మరో నేత తెరపైకి వస్తారని భావిస్తున్న `220 క్లబ్' అనేడిది  బీజేపీలో లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఇది కేవలం మీడియా వర్గాల ఊహాగానమేనని తోసిపుచ్చారు. 

లోక్‌సభలో బీజేపీ బలం 220 సీట్లలోపే ఉండాలని, తద్వారా ఎన్డీయే పక్షాల మద్దతుతో మోదీకాకుండా మరో బీజేపీ నేత ప్రధాని పదవిని చేపట్టాలని కమలం పార్టీలో కొందరు భావిస్తున్నట్లు మీడియాలో విశ్లేషణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సంఖ్యా బలం తగ్గితే బీజేపీ నేతల్లో గడ్కరీ ప్రధాని పదవికి ఆమోదయోగ్యమైన అభ్యర్థిగా తెరపైకి రావచ్చన్న ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. 

అయితే అటువంటి చర్చేదీ జరుగలేదని, మోదీ నాయకత్వంలోనే బీజేపీ మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకోవడం ఖాయమని గడ్కరీ ధీమా వ్యక్తం చేశారు. ఆరెస్సెస్‌తో మంచి సంబంధాలు ఉండటంతోపాటు మిత్రపక్షాలతో కలిసి పనిచేయగల నేతగా గడ్కరీని ప్రస్తావిస్తుండటంపై ప్రశ్నించగా అటువంటిదేమీ లేదని కొట్టిపారవేశారు. అటువంటి లెక్కలు, అంచనాలను వేయను. నేను బీజేపీ కార్యకర్తనే. ఐదేండ్లు మోదీ నాయకత్వంలో చేసిన పనులతో ఈసారి కూడా బీజేపీకి పూర్తి మెజార్టీ వస్తుందని భరోసా వ్యక్తం చేశారు. 

`కనుక ఆ పరిస్థితేమీ ఉత్పన్నం కాదని నేను గట్టిగా భావిస్తున్నా' అని గడ్కరీ స్పష్టం చేశారు. బాలాకోట్‌లో భారత వాయుసేన జరిపిన దాడులను, రామ మందిరం అంశాన్ని రాజకీయం చేయడం విచారకరమని చెప్పారు. ఉగ్రవాద శిబిరాలపై వాయుసేన దాడులకు రుజువులు చూపాలని డిమాండ్ చేయడం సముచితం కాదని హితవు చెప్పారు. మన సైనిక బలగాల చర్యలకు రుజువులను అడుగుతూ వారి ఉద్దేశాలను ప్రశ్నిస్తున్న విపక్షాలను చూసి జనం నవ్వుకుంటున్నారని తెలిపారు. 

నరేంద్రమోదీని విమర్శించేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ ఉపయోగిస్తున్న భాష గర్హనీయమైనదని పేర్కొన్నారు. అది రాజకీయాల్లో సరికొత్త దిగజారుడుకు నిదర్శనమని గడ్కరీ దయ్యబట్టారు. ప్రధాని పీఠాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించి తీరాలి. ఆ పదవిలో ఉన్నవారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం. మోదీపై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు విచారకరం అని పేర్కొన్నారు. 

దేశాభివృద్ధిలో మోదీ ప్రభుత్వ రికార్డును చూసి ఓటర్లు బీజేపీకి మద్దతు తెలుపుతారని, వరుసగా రెండోసారి అధికారాన్ని అప్పగిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారిపోయాయని, ప్రజలపై అవి సానుకూల ప్రభావాన్ని చూపి మోదీ నాయకత్వంపై మరింత మంచి నమ్మకాన్ని సృష్టించాయని గడ్కరీ తెలిపారు. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ప్రభుత్వం ముందున్న అవకాశాలు చాలా స్వల్పమని, చర్చలు లేదా కోర్టు తీర్పు లేదా చట్టం ద్వారానే ఈ సమస్య పరిష్కారమవుతుందని చెప్పారు.