సెక్యూరిటీ గార్డులను అవమానిస్తున్న వివక్షాలు

తనను చౌకీదార్ చోర్ హై (కాపలాదారు దొంగ) అ ని దూషిస్తూ విపక్ష పార్టీలు దేశంలోని సెక్యూరిటీ గార్డులను అవమానిస్తున్నాయని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. దేశభక్తికి చౌకీదార్ పర్యాయపదంగా మారిందాని చెప్పారు. హోలీ పండుగ సందర్భంగా ప్రధాని దేశంలోని 25 లక్షల మంది సెక్యూరిటీ గార్డులతో ఆడియో బ్రిడ్జ్ మాధ్యమం ద్వారా మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన మై భీ చౌకీదార్ (నేనూ కాపలాదారునే) ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేశారు. 

కొందరు నన్ను దూషించి చౌకీదార్లను అవమానించడం దురదృష్టకరం అని మోదీ పేర్కొన్నారు. తన ప్రత్యర్థులకు తనను నేరుగా విమర్శించే దమ్ము లేక వాచ్‌మ్యాన్‌లను లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శించారు. కష్టపడే వారిపై ద్వేషం వెళ్లగక్కడం రాజవంశీకులకు అనాదిగా ఉన్న అలవాటేనని గాంధీ-నెహ్రూ కు టుంబంపై పరోక్షంగా విరుచుకుపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంట్, న్యాయవ్యవస్థ, మీడియా, సాయుధ దళాలను అవమానించిందని ప్రధాని మోదీ ఆరోపించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు ఓటు వేసేముందు విచక్షణతో ఆలోచించాలని కోరారు. తమ ప్రభుత్వానికి రాజ్యాంగ సంస్థలే  ప్రధానమని స్పష్టం చేస్తూ ఆయన ఆన్‌లైన్‌లో ఒక వ్యాసం (బ్లాగ్ పోస్ట్) రాశారు. 

దేశంలో వారసత్వ రాజకీయాలు బలంగా ఉన్న ప్రతిసారి, రాజ్యాంగ సంస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయని మోదీ గుర్తు చేశారు. పత్రికా స్వేచ్ఛ విషయంలో వారసత్వ పార్టీలు ఎన్నడూ సంతృప్తిగా లేవని దుయ్యబెట్టారు. రాజవంశం (గాంధీ కుటుంబం) ప్రయోజనాల పరిరక్షణకు ఎమర్జెన్సీ విధించారని ఆరోపించారు. రాష్ట్రాలలో గవర్నర్ పాలన విధించే అధికారం కల ఆర్టికల్ 356ను కాంగ్రెస్ వందసార్లు దుర్వినియోగం చేసింది. స్వయంగా ఇందిరాగాంధీ 50 సార్లు ఆ అధికరణాన్ని ఉపయోగించారని గుర్తు చేశారు. 

కోర్టు ధిక్కరణకు పాల్పడటం కాంగ్రెస్‌కు ఆనవాయితీగా వస్తున్నదని దయ్యబట్టారు. కోర్టులు రా జ్యాంగానికి బదులుగా ఒక కుటుంబానికి విధేయత కలిగి ఉండటం కోసం మాజీ ప్రధాని ఇందిర నిబద్ధత కలిగిన న్యాయవ్యవస్థ కోసం పిలుపునిచ్చారని పేర్కొన్నారు. కాగ్‌ను, ప్రణాళికా సంఘాన్నీ కాంగ్రెస్ గౌరవించలేదని ఆరోపించారు. వారి హయాంలో సీబీఐ కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా మారిపోయిందని తెలిపారు. కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ఏ మంత్రిత్వ శాఖలోనూ సభ్యుడుకాని ఒక వ్యక్తి చించివేశారని రాహుల్‌గాంధీనుద్దేశించి దుయ్యబట్టారు.