దేశాన్ని తీవ్ర కష్టాల్లోకి నెత్తిన కుటుంబ దాహం

 అధికారం చేపట్టాలన్న ఒక కుటుంబ దాహం దేశాన్ని తీవ్ర కష్టాల్లోకి నెట్టిందని చెబుతూ  పరోక్షంగా గాంధీ-నెహ్రూ కుటుంబంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. వంశ పారంపర్య పాలనలో దేశంలో వ్యవస్థలన్నీ బలహీనపడ్డాయని ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో తన విమర్శల్లో పదును పెంచుతూ తాజాగా సామాజిక మాధ్యమం వేదికగా కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ బుధవారం తన బ్లాగ్‌లో ఓ సుదీర్ఘ సందేశం రాసుకొచ్చారు. 

2014లో ప్రజలు సరైన తీర్పు చెప్పారని మోదీ పేర్కొంటూ వంశ పాలనకు వ్యతిరేకంగా నిజాయతీని, కుంటుపడుతున్న వ్యవస్థలకు వ్యతిరేకంగా అభివృద్ధిని ఎన్నుకున్నారని తెలిపారు. 

‘‘మీరు ఓటు వేసే ముందు ఒకసారి గతాన్ని గుర్తుకు తెచ్చుకోండి. అధికారంపై ఒక కుటుంబానికి ఉన్న దురాశతో దేశం ఎంత నష్టపోయిందో ఆలోచించండి. గతంలో తప్పులు చేయగలిగిన వారు..ఇప్పుడూ చేస్తారు’’ అని మోదీ తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు. గతంలో ఆశ్రిత పక్షపాతం, అవినీతి, బంధు ప్రీతి లాంటి రుగ్మతలతో దేశ ప్రజలు విసుగుచెందారని పరోక్షంగా కాంగ్రెస్‌ పాలనను విమర్శించారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ప్రజలు మెరుగైన పాలనను ఎన్నుకున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. 

న్యాయవ్యవస్థపై కాంగ్రెస్‌కు గౌరవం లేదని మోదీ ఆరోపించారు. కోర్టు తీర్పుల విషయంలో కాంగ్రెస్‌ ‘తిరస్కరణ, తోసిపుచ్చడం, బెదిరించడం’ అనే సూత్రాన్ని అవలంబిస్తోందని విమర్శించారు. న్యాయమూర్తులను అభిశంసన పేరిట బెదిరింపులకు గురిచేయడానికి కూడా వారు వెనకాడరని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి చోటు ప్రధాని స్పష్టం చేశారు. 

పార్టీ అధ్యక్ష పీఠంపై ఎవరైనా ఆశపడితే వారిని పార్టీ నుంచి తరిమేస్తారని  విమర్శించారు. వ్యవస్థల్ని బిజెపి  నిర్వీర్యం చేస్తుందన్న కాంగ్రెస్‌ చేస్తున్న విమర్శలను తిప్పి కొడుతూ ఎన్‌ఏసీ అనే సంస్థలను సృష్టించి వ్యవస్థల్ని బలహీనపర్చింది కాంగ్రెస్సే అని ధ్వజమెత్తారు. 

కాంగ్రెస్‌ పార్టీ అధినాయకత్వంలోని కొంత మంది అవినీతి కేసుల్లో బెయిల్‌పై బయట తిరుగుతున్నారని మోదీ గుర్తు చేస్తూ అధికారుల ప్రశ్నలకు వారు సరిగా స్పందించడం లేదని ఆరోపించారు. వారికి బాధ్యతాయుతంగా నడుచుకోవడం తెలియదని విమర్శించారు. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు సంబంధంలేని వారు సైతం ప్రభుత్వ విషయాల్లో జోక్యం చేసుకునేవారని ఆరోపించారు. 

కేంద్ర కేబినేట్‌ ఆమోదించిన అత్యవసరాదేశాలను కూడా వారు చించేశారని పరోక్షంగా రాహుల్‌ గాంధీని ఉద్దేశిస్తూ విమర్శలు గుప్పించారు. తీవ్ర అవినీతికి  పాల్పడిన కాంగ్రెస్‌ తుపాకుల నుంచి జలాంతర్గాములు, హెలికాప్టర్ల వరకూ దేన్నీ వదల్లేదని ఎద్దేవా చేశారు.