టీఆర్ఎస్ కు ప్రత్యామ్న్యాయంగా ఎదిగే శక్తీ బీజేపీకే ఉంది

తెలంగాణలో  టీఆర్ఎస్ కు ప్రత్యామ్న్యాయంగా ఎదిగే శక్తీ బిజెపికి మాత్రమే ఉన్నదని గ్రహించి ఆ పార్టీలో చేరానని మాజీ మంత్రి డి కె అరుణ ప్రకటించారు. ఆమె మంగళవారం రాత్రి ఢిల్లీలో బిజెపి అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. బుధవారం హైదరాబాద్ లో బిజెపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ  దేశ ప్రజలకు రక్షణ కల్పించే శక్తి కేవలం మోదీ నాయకత్వంలోని బీజేపీకే ఉందని భావించి.. తాను బిజెపిలో  చేరినట్టు స్పష్టంచేశారు. 

తెలంగాణలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని గెలిపించేందుకు కృషి చేస్తానని ఆమె తెలిపారు. ఎన్నో ఆకాంక్షలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, అలాంటి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఖూనీ చేశారని ఆమె ధ్వజమెత్తారు.  ఎన్నో మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసి  టీఆర్ఎస్   రెండోసారి అధికారంలోకి వచ్చిందని ఆమె విమర్శించారు. 

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో పూర్తిగా క్షీణించిపోతోందని చెబుతూ అందుకు కాంగ్రెస్‌ ముఖ్య నేతల వ్యవహారశైలే కారణమని అరుణ ఆరోపించారు.  టీఆర్ఎస్  తో లాలూచీ పడి కాంగ్రెస్‌ పార్టీని పూర్తిగా నాశనం చేశారని ఆమె ధ్వజమెత్తారు. 

డీకే అరుణ చేరికతో బిజెపికి బలం చేకూరుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్‌ భరోసా వ్యక్తం చేశారు. తెలంగాణలో   టీఆర్ఎస్  తో కాంగ్రెస్‌కు లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపించారు. కాంగ్రెస్‌ అవకాశవాద రాజకీయాలకు విసిగి డీకే అరుణ బిజెపిలో చేరారని చెప్పారు. కేంద్రం మెడలు వంచుతామని కేసీఆర్‌ అంటున్నారని అంటూ కేంద్రంలో చక్రం తిప్పడం కాదు బొంగరం కూడా తిప్పలేరని ఎద్దేవా చేశారు. 

 టీఆర్ఎస్   ఆటలను కట్టడి చేయడానికి అరుణలాంటి వారు బిజెపిలో చేరుతున్నారని పేర్కొన్నారు. అలాగే, ఇంటిపార్టీ నేత యన్నం శ్రీనివాస్‌ రెడ్డి కూడా బిజెపిలో చేరారు. కాగా, కాంగ్రెస్ నుంచి మరికొంత మంది ముఖ్య నాయకులు భవిష్యత్తులో బిజెపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని లక్ష్మణ్‌ ప్రకటించారు.