వైసీపీలో చేరిన మాజీ మంత్రి ఆనం

ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ఫిరాయింపు రాజకీయాలు ఊపండుకొంతున్నాయి. తమకు రాజకీయ భవిష్యత్ కు హామీ ఇవ్వగలదనుకొంటున్న పార్టీలో చేరడం కోసం సీనియర్ నేతలు క్యూ కడుతున్నారు. తాజా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్ధిక మంత్రిగా ఉన్న సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

విశాఖ పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ఆనంకు పార్టీ కండువా కప్పి సాదరంగా వైసీపీలోకి ఆహ్వానం పలికారు. ఆనంతో పాటు ఆయన ప్రధాన అనుచరులు కొందరు జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఆనం చేరికతో నెల్లూరు వైసీపీలో సరికొత్త సమీకరణాలు మొదలయ్యాయి. ఆనం ఎక్కడ నుంచి పోటీ చేయబోతున్నారనే అంశం ఆసక్తికరంగా మారింది.

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో పదేళ్ల పాటు మంత్రిగా పని చేసిన ఆనం రామనారాయణరెడ్డి, ఆయన సోదరుడు దివంగత నేత వివేకానందరెడ్డి రెండేళ్ల క్రితం టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. గత ఎన్నికలలో ఓటమి చెందినప్పటి నుండి కాంగ్రెస్ కు దూరం అయ్యారు. సీఎం చంద్రబాబు రామనారాయణరెడ్డిని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఆత్మకూరు ఇన్‌చార్జిగా నియమించినా హామే విధంగా తమ కుటుంభానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని, చెప్పిన పదవులు ఇవ్వడం లేదనే అసంతృప్తితో ఉంటూ కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

ఇటీవల జరిగిన మినీ మహానాడు వేదికపై నుంచి ప్రభుత్వాన్ని, అధినాయకత్వాన్ని విమర్శించడం ద్వారా పార్టీ మారుతున్న సంకేతాలను అందజేశారు. వైసీపీ నాయకులతో మూడు నెలల పాటు జరిపిన చర్చల అనంతరం కొద్ది రోజుల క్రితం ఆ పార్టీలో చేరుతున్నట్లు ఆనం ప్రకటించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని ఈ సందర్భంగా ఆనం రామానారాయణ రెడ్డి ఈ సందర్భంగా విమర్శించారు. ప్రజలకు అండగా నిలవాలని జగన్ పాదయాత్ర చేస్తున్నారని, ఆయన చేసే ప్రయత్నం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.