విశ్వాస పరీక్షలో నెగ్గిన ప్రమోద్ సావంత్

మనోహర్‌ పారికర్ వారసుడిగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన ప్రమోద్‌ సావంత్ బుధవారం జరిగిన విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. గవర్నర్‌ నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక శాసనసభ సమావేశంలో బీజేపీ ప్రభుత్వం 20-15 ఓట్లతో బలపరీక్షలో విజయం సాధించింది. మేజిక్‌ ఫిగర్‌ 19 కాగా.. బీజేపీ ఒక ఓటు ఎక్కువే సాధించింది. 

బీజేపీకి సొంతంగా 12 మంది సభ్యులు ఉండగా. మహారాష్ట్రవాది గోమంతక్‌ పార్టీ, గోవా ఫార్వర్డ్‌ బ్లాక్‌, స్వతంత్ర శాసనసభ్యుల మద్దతుతో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్‌కు 14, బీజేపీకి 12, మహారాష్ట్రవాది గోమంతక్‌ పార్టీకి మూడు, గోవా ఫార్వర్డ్‌ బ్లాక్‌కు మూడు, ముగ్గురు స్వతంత్ర సభ్యులు, ఒక్క ఎన్‌సీపీ సభ్యుడు ఉన్నారు.  

గోవాలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలుండగా.. ప్రస్తుతం 36 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఇద్దరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేల మరణం, మరో ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రాజీనామా చేయడంతో ఎమ్మెల్యేల సంఖ్య 36కు  తగ్గింది. కాంగ్రెస్‌ నుంచి 14 మంది ఎమ్మెల్యేలున్నారు. 

అయితే స్వతంత్ర అభ్యర్థులతో పాటు చిన్న పార్టీల మద్దతు కూడా తమకే ఉందని, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తమకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర గవర్నర్‌ మృదులా సిన్హాను కాంగ్రెస్‌ కోరింది. దీంతో బలనిరూపణ చేసుకోవాల్సిందిగా గవర్నర్‌ కొత్త ప్రభుత్వాన్ని ఆదేశించారు. 20 మంది ఎమ్మెల్యేల మద్దతుతో బలనిరూపణలో ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ నెగ్గారు.