బీజేపీలో చేరిన డి కె అరుణ

తెలంగాణలో  కాంగ్రెస్‌ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, సీనియర్‌నేత డీకే అరుణ బీజేపీ గూటికి చేరారు. దిల్లీలో మంగళవారం రాత్రి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా సమక్షంలో  ఆమె బిజెపిలో చేరారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కాంగ్రె్‌సను ఒంటి చేత్తో నడిపించడంతోపాటు జిల్లా రాజకీయాలను శాసించిన ఆమె.. పార్టీని వీడారు. 

మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం నుంచి అరుణ బరిలో నిలువనున్నారని తెలిసింది.  1996లో టీడీపీ నుంచి డీకే అరుణ మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానంలో తొలిసారిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 1999లో గద్వాల అసెంబ్లీ స్థానంలో ఆమె కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి 2004లో గద్వాలలో సమాజ్‌వాదీ పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం కాంగ్రె్‌సలో చేరారు. 2009, 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలిచారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  గద్వాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన డీకే ఆరుణ ..   టీఆర్ఎస్  అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో డీకే ఆరుణ బిజెపిలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

అమిత్ షా ఆదేశాల మేరకు అరుణతో తొలుత  పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ హైదరాబాద్ లో సుదీర్ఘంగా చర్చలు జరిపిన్నట్లు తెలుస్తున్నది. ఆ తర్వాత ఆమె ఢిల్లీకి బయలుదేరారు. అసెంబ్లీ ఎన్నికల ముందే ఆమె బీజేపీలో చేరుతున్నట్లు కధనాలు వెలువడినా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆమె ఆగిన్నట్లు తెలుస్తున్నది. 

మరోవైపు కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే సోయం బాపూరావు మంగళవారం బీజేపీలో చేరారు. బాపూరావుతోపాటు ఆదిలాబాద్‌ జిల్లా పార్టీ నాయకురాలు సుహాసినికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ కండువా కప్పి ఆహ్వానించారు.

మరోవంక, మరో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా తాను టీఆర్‌ఎస్‌లో చేరుతున్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆమె కుమారుడు కార్తిక్ రెడ్డి మంగళవారం టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ఇప్పటికే కాంగ్రెస్‌కు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నామని ప్రకటించారు. మరొకొందరు కూడా చేరే అవకాశాలు కనబడుతున్నాయి. ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు కాంగ్రెస్‌ను వీడుతుండడంతో రాష్ట్రంలో ఆ పార్టీ అస్థిత్వానికే ప్రమాదం ఏర్పడనుంది.