283 లోక్‌సభ సీట్లు సాధిస్తామని బీజేపీ ధీమా !

కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నా ఈ సారి కూడా 283 లోక్‌సభ సీట్లు సొంతంగా సాధిస్తామని బీజేపీ వర్గాలలో ధీమా వ్యక్తం అవుతున్నది. మిత్రపక్షాలతో కలిసి గతంలో మాదిరి 330 స్థానాలు సంపాదిస్తుందని భరోసా వ్యక్తం చేస్తున్నారు. అందుకు అంతర్గత సర్వేలే నమ్మకం కలిగిస్తున్నాయి. 

కాంగ్రెస్ కు గతంలో కంటే రెట్టింపు సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నా  వంద సీట్లకు మించి దాటే అవకాశం కనబడటం లేదు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి 20 నుంచి 30 సీట్లు తగ్గవచ్చని ఆ పార్టీ అంచనాలను బట్టి తెలుస్తోంది. అటు మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, ఢిల్లీ, జమ్ముకాశ్మీర్‌లో 2 నుంచి 4 సీట్ల చొప్పున తగ్గవచ్చుని అనుకుంటున్నారు. మొత్తానికి గతంలో గెలిచిన స్థానాల్లో 40 నుంచి 50 సీట్లు కోల్పోయినా.. ఇతర రాష్ట్రాల్లో ఆ మేరకు సీట్లు సాధిస్తామని బీజేపీ అంతర్గత సర్వేలను బట్టి తెలుస్తోంది. 

మహారాష్ట్ర, బిహార్‌లో బీజేపీ సంఖ్యాబలం ఏ మాత్రం తగ్గదని, ఈశాన్యంలో గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని ఆ పార్టీ సీనియర్‌ నాయకులు ఒకరు చెప్పారు. పశ్చిమబెంగాల్‌లో కనీసం 15 సీట్లు ఆశిస్తున్నామని, ఒడిసాలో కూడా 10- 15 సీట్లు సాధిస్తామని ఆయన చెప్పారు. కర్ణాటకలో గతంలో సాధించిన 17 సీట్లకంటే ఎక్కువే వస్తాయని, తాము 22 సీట్లు లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.

 కేరళలో రెండు సీట్లు గెలుస్తామని, తమిళనాడులో కోయంబత్తూర్‌, నాగర్‌ కోయిల్‌ సీట్లు తమవేనని ఆయన పేర్కొన్నారు. అంతర్గత అంచనాల ప్రకారం గతంలో సాధించిన 283 లోక్‌సభ సీట్లు ఈ సారి కూడా బీజేపీ దాదాపుగా సాధిస్తుందని, మిత్రపక్షాలతో కలిసి గతంలో మాదిరి 330 స్థానాలు సంపాదిస్తుందని తెలిపారు. 

కాగా, కాంగ్రెస్‌ మహాకూటమి ఏర్పాటుకు నానా తంటాలు పడుతుంటే దేశంలో ఉన్న అనేక పార్టీలతో బీజేపీ ఇప్పటికే ఒక అవగాహన కుదుర్చుకుందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. దాదాపు 30 పార్టీలతో బీజేపీకి అవగాహన ఉందని తెలిపాయి. యూపీలో ఎస్పీ ఓట్లు బీఎస్పీకి బదిలీ కావని ఓ సీనియర్‌నేత పేర్కొన్నారు. రెండేళ్ల అసెంబ్లీ ఎన్నికలలో ఎస్పీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నా ఎస్పీ ఓట్లు కాంగ్రెస్ కు బదిలీ కాకపోవడం గమనార్హం.