కాంగ్రెస్ పుంజుకొంటున్నా రాహుల్ ప్రధాని కల నెరవేరేనా !

2014తో పోల్చుకొంటే కాంగ్రెస్ పార్టీ పరిష్టితి కొన్ని రాష్ట్రాలలో పుంజుకొంటున్నా ప్రధాన మంత్రి పదవి చేపట్టాలనే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కల నెరవేరే అవకాశాలు కనిపించడం లేదు.

రాహుల్‌గాంధీ కల నెరవేరాలంటే కాంగ్రెస్ 272 సీట్ల మ్యాజిక్ ఫిగర్ సాధించాలి. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఆ పార్టీకి అంత సీన్ ఉన్నట్టు కనిపించడంలేదు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ర్టాలు ఛత్తీస్‌గఢ్ (11), కర్ణాటక (28), మధ్యప్రదేశ్ (29), పంజాబ్ (13), రాజస్థాన్ (25), పుదుచ్చేరి (1). ఈ ఆరు రాష్ర్టాల్లో మొత్తం లోక్‌సభ స్థానాలు 107 ఉన్నాయి. వీటిలో అరవై శాతం సీట్లు గెలుచుకున్నా 62కు మించవు. 

గోవా, మణిపూర్ అసెంబ్లీల్లో అత్యధిక సీట్లు ఉన్న పార్టీగా ఉండ టం వల్ల అక్కడ ఉన్న నాలుగు సీట్లలో కాంగ్రెస్‌కు ఎంతవరకు లాభిస్తుందో చూడా లి. ఇలాంటి చిన్నచిన్న రాష్ట్రాల్లో ఎన్ని సీట్లు వచ్చినా ఢిల్లీ పీఠం చేరువకావడం అంత తేలికకాదు.   

ఎవరో ఒకరితో పొత్తులకు పోతే తప్ప అధికారం దక్కే పరిస్థితి కాంగ్రెస్‌కు లేదు. కాంగ్రెస్ మిత్రపక్షాలకు లభించే సీట్లను బట్టి రాహుల్ ప్రధాని కావాలన్న కల నెరవేరుతుందా లేదా అన్నది తేలుతుంది. ఇప్పటివరకు కాంగ్రెస్ పొత్తులు పెట్టుకున్న రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు ఉన్నరాష్ట్రాల్లో తమిళనాడు, బీహార్ ఉన్నాయి. 

తమిళనాడులో డీఎంకేతో కలిసి కాంగ్రెస్ ఎన్నికల బరిలోకి దిగుతున్నది. ఇక్కడ మొత్తం 39 పార్లమెంట్ స్థానాలున్నాయి. ఈ రాష్ట్రానికి సంబంధించి ఇప్పటివరకు వచ్చిన అన్ని సర్వేలు కూడా డీఎంకేకు అనుకూల ఫలితాలు వస్తాయని చెప్తున్నాయి. ఇది కాంగ్రెస్‌కు నిస్సందేహంగా మేలుచేసే అంశమే. 

ఇక బీహార్‌లో ఆర్జేడీతో పొత్తు పెట్టుకున్నారు. ఇక్కడ 40 సీట్లు ఉన్నాయి. ఇక్కడ మోదీ-నితీశ్ కూటమి బలంగా ఉన్నది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ కూటమి ఏ మేరకు సీట్లు గెలుస్తుందన్నది చూడాలి.  

కేరళలో అధికారంలో ఉన్న లెఫ్ట్ ఫ్రంట్‌కు ఇటీవలి కాలంలో తీవ్రంగా వ్యతిరేక పవనాలు వీస్తూ ఉండడంతో కాంగ్రెస్ చెప్పుకోదగిన ప్రయోజనం పొందే అవకాశం ఉంది. కానీ ఈ రాష్ట్రంలో మొత్తం సీట్లు 20 మాత్రమే. మరే ఇతర రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ చెప్పుకోదగినంత పుంజుకొని అవకాశాలు  కనబడటం లేదు.