ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ ఎవరికి వారే యమునాతీరే

బిజెపిని ఓడించడం కోసం ఒకే అభ్యర్థిని నిలబెట్టే విధంగా ప్రతిపక్షాలు మహా కూటమి ఏర్పాటు చేయాలనీ మాటలు చెప్పడమే గాని వారి మధ్య సయోధ్య సాధ్యం కావడం లేదు. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ తో చేతులు కలపనిదే బిజెపి తిరిగి మొత్తం ఏడు సీట్లను గెలుస్తుందనే భయంతో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆ పార్టీతో పొత్తు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆయన ప్రయత్నాలను ఆయన పార్టీ నేతలే వమ్ము చేస్తున్నారు. 

ఇప్పటికే ఆప్ మొత్తం ఏడు సీట్లను అభ్యర్థులను ప్రకటించింది. ఇక్కడ ఆప్ తో చేతులు కలిల్పితే పంజాబ్, హర్యానాలో కూడా పొత్తులు పెట్టుకోవచ్చని రాహుల్ ఆశిస్తున్నారు. అయితే ఆప్ తో పొత్తు ఆత్మహత్య సాదృశ్యమని, కాంగ్రెస్ కనుమరుగవుతోంది మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షీలా దీక్షిత్ రాహుల్ ను హెచ్చరిస్తున్నారు. 

ఎవరికి వారే యమునాతీరే అన్నట్టుగా ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరి పోటీకి సిద్ధమవుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు  తాజాగా ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ బరిలోకి దిగారు. బీజేపీని ఓడించడమే ఏకైక లక్ష్యంగా ఇరు పార్టీలు సయోధ్యతో ముందుకు వెళ్లాలని పవార్ ఇరుపార్టీల అగ్రనేతలకు సూచించినట్టు తెలుస్తోంది. ఇందుకు పొత్తు అనివార్యమని ఆయన నచ్చజెప్పే ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ సింగ్‌ను కూడా పవార్ కలుసుకోనున్నారు. 

 పవార్ మధ్యవర్తిత్వ ప్రయత్నాలపై  కాంగ్రెస్, ఆప్ సైతం ఎలాంటి ప్రకటనా చేయలేదు. కాగా, శరద్ పవార్ జోక్యంతో ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ షీలాదీక్షిత్ తన నివాసంలో పార్టీ నాయకులతో సమావేశమై ఆప్‌తో పొత్తు విషయమై పునరాలోచన మంతనాలు సాగిస్తున్నారు. పార్టీ అగ్ర నాయకత్వ నిర్ణయమే శిరోధార్యమని వారు చెబుతున్నారు. కాగా, ఆప్‌తో పొత్తు వల్ల లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి హాని జరుగుతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి షీలా దీక్షిత్ ఓ లేఖలో స్పష్టం చేశారు.

ఈ పొత్తు విషయమై ఢిల్లీలోని పార్టీ కార్యకర్తల అభిప్రాయం సేకరణకోసం అంతర్గత సర్వే యాప్ ద్వారా కాంగ్రెస్ దిల్లీ ఇన్‌ఛార్జి పీసీ చాకో చేపట్టడం పట్ల షీలా దీక్షిత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక విధంగా ఆమె ధిక్కార ధోరణి ప్రదర్శిస్తున్నారు.