సంపూర్ణ మెజారిటీ సాధించనున్నబీజేపీ, మిత్రపక్షాలు

కేంద్రంలో మరోసారి ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఓ తాజా సర్వే వెల్లడించింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి సంపూర్ణ మెజారిటీ సాధించి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని టైమ్స్‌నౌ-వీఎంఆర్ సర్వే అంచనా వేసింది. 

పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత వాయుసేన పాక్‌లోని బాలాకోట్‌పై దాడులు చేయడంతో ప్రజల్లో ఎన్డీయే ప్రతిష్ఠ బాగా పెరిగిందని ఆ సర్వే పేర్కొంది. లోక్‌సభ ఎన్నికలు జనవరి నెలలో నిర్వహించి ఉంటే ఆ కూటమికి కనీసం 21 సీట్లు తగ్గేవని, కానీ బాలాకోట్ దాడుల అనంతరం ఆ కూటమి సంపూర్ణ మెజారిటీ సాధించే స్థితికి చేరుకుందని తెలిపింది.

లోక్‌సభలోని మొత్తం 543 స్థానాలకు గాను ఎన్డీయే కూటమికి 283, యూపీఏకు 135, ఇతరులకు 125 సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. దేశవ్యాప్తంగా 16,931మందిని ప్రశ్నించి ఈ అంచనాకు వచ్చిట్టు వెల్లడించింది. ఈ సర్వే వివరాలిలా ఉన్నాయి. పంజాబ్, జమ్ముకశ్మీర్ మినహా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలలో ఎన్డీయే కూటమి ప్రభావం ఉంటుంది. ఎన్డీయే తన ఓట్ల శాతాన్ని 38.5 శాతం నుంచి 40 శాతానికి పెంచుకోగలదు. 

అలాగే గత ఎన్నికల్లో 23 శాతం ఓట్లను మాత్రమే పొందిన యూపీఏ ఈసారి 30.6 శాతం ఓట్లను సాధించే అవకాశముంది. హిందీ ప్రాంత రాష్ట్రాలు, ఈశాన్యంలో ఎన్డీయే భారీ విజయాలను నమోదు చేయవచ్చు. మధ్యప్రదేశ్‌లో 29కి 22, రాజస్థాన్‌లోని 25లో 20, ఛత్తీస్‌గఢ్‌లోని 11 సీట్లలో ఆరింటిని ఎన్డీయే కూటమి గెలుచుకోగలదు. ఈ మూడు రాష్ట్రాల్లోనూ మూడు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 

ఉత్తర్‌ప్రదేశ్‌లో మాత్రం ఎస్పీ-బీఎస్పీ కూటమి బీజేపీ ఆధిపత్యానికి గండి కొట్టే పరిస్థితులున్నాయి. ఆ రాష్ట్రంలో ఎస్పీ-బీఎస్పీకి 36, ఎన్డీయేకు 42 సీట్లు వచ్చే అవకాశముంది. ఒడిశా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ భారీ విజయాలను నమోదు చేయవచ్చు. బీహార్, గుజరాత్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, హర్యానాలో ఎన్డీయే ఆధిపత్యం కొనసాగుతుంది. 

కర్ణాటక, జార్ఖండ్ రాష్ర్టాల్లో మాత్రం కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశముంది. కేరళ, తమిళనాడులో యూపీఏ కూటమి ఆధిపత్యం చూపగలదు అని సర్వే తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ, తెలంగాణలో టీఆర్‌ఎస్ భారీ విజయాలను నమోదు చేయగలవని ఈ సర్వే అంచనా వేసింది.