గోవా కొత్త సీఎంగా ప్రమోద్ సావంత్!

గోవా తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ప్రమోద్ సావంత్‌ను బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆధ్వర్యంలో జరిగి బీజేఎల్పీ సమావేశంలో తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సావంత్‌‌ను ఎన్నుకున్నామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వినయ్ టెండూల్కర్ స్పష్టం చేశారు. 

ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న మనోహర్ పర్రీకర్ తీవ్ర అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశారు. దీంతో అధికార పార్టీ అయిన బీజేపీ కొత్త నాయకుడిని ఎన్నుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతమున్న నాయకుల్లో ప్రమోద్‌ ఎంపికకే ఎక్కువ అవకాశాలు ఉండడంతో ఆయన్ను తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేఎల్పీ ఎన్నుకొంది. 

అయితే బీజేపీలో సీనియర్ లీడర్లైన మాజీ సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్, మాజీ మంత్రి రాజేంద్ర అర్లేకర్ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో ప్రమోద్ సావంత్ మాత్రమే బీజేపీలో బలంగా కనిపించడంతో ఆయన్నే బీజేఎల్పీ లీడర్‌గా ఎన్నుకున్నారు.  

ఇక మహారాష్ట్రవాది గోమంతక్‌ పార్టీ (ఎంజీపీ) ఎమ్మెల్యే సుదిన్‌ దివాలికర్‌,  గోవా ఫార్వర్డ్‌ పార్టీ ఎమ్మెల్యే విజయ్‌ సర్దేశాయ్‌లకు ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం ఇచ్చినట్లుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సోమవారం రాత్రి గవర్నర్‌ మృదులా సిన్హా వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు సమాచారం.