తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

ఎన్నికల ప్రక్రియలో కీలకమైన తొలి ఘట్టానికి ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నిల నోటిఫికేషన్‌ విడుదలైంది. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాల కోసం నోటిఫికేషన్‌ను ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ విడుదల చేశారు. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. 

ఈనెల 21న హోలీ, 24 ఆదివారం.. సెలవు దినాలు కావడంతో ఆ రెండురోజులూ నామినేషన్ల స్వీకరణ ఉండదు. ఎన్నికల నిర్వహణలో రెవెన్యూ, పోలీసు యంత్రాంగం కలిపి సుమారు 2.50 లక్షలమంది సిబ్బంది పాల్గొననున్నారు.

 అటు ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది ఈ నోటిఫికేషన్‌ సోమవారం ఉదయం విడుదల చేశారు. 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. అనంతరం జిల్లాల వారీగా నోటిఫికేషన్లను కలెక్టర్లు విడుదల చేశారు.

 దేశవ్యాప్తంగా తొలి దశ పోలింగ్‌ జరిగే 20 రాష్ట్రాల్లోని 91 లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల  స్వీకరణ కొనసాగనుంది. 

నామినేషన్ల స్వీకరణకు గడువు ఈ నెల 25తో ముగియనుంది. 26వ తేదీన నామినేషన్ల పరిశీలన, 27 నుంచి 28 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇవ్వనున్నారు. ఏప్రిల్‌ 11న పోలింగ్‌ జరగనుండగా.. మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.