పారికర్‌ పార్థివదేహానికి మోదీ నివాళి

అనారోగ్యంతో కన్నుమూసిన గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ పార్థివదేహానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులర్పించారు. ఈ మధ్యాహ్నం పనాజీ చేరుకున్న ప్రధాని మోదీ.. కాలా అకాడమీకి వెళ్లి పారికర్‌కు అంజలి ఘటించారు. అనంతరం పారికర్‌ కుటుంబసభ్యులను ఓదార్చారు. కేంద్ర రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా పారికర్‌ భౌతిక కాయానికి నివాళులర్పించారు. అంతకుముందు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ, పలువురు బిజెపి నేతలు పారికర్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. 

ఏడాదిగా అనారోగ్యంతో బాధపడుతున్న పారికర్‌ పరిస్థితి విషమించడంతో ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ప్రజల సందర్శనార్థం పారికర్‌ భౌతికకాయాన్ని కాలా అకాడమీకి తీసుకొచ్చారు. సాయంత్రం 5 గంటలకు మిరామర్‌ బీచ్‌లో సైనిక లాంఛనాలతో పారికర్‌ అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.  

 కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూడా పారికర్‌ పార్థివదేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పారికర్‌ను గుర్తుచేసుకుని స్మృతి భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. ఆయన కుటుంబసభ్యులను కలిసి పరామర్శించారు. 

మనోహర్‌ పారికర్‌ మృతికి అమెరికా, రష్యా దేశాలు సంతాపం ప్రకటించాయి. ‘పారికర్‌ మృతి విచారకరం. ఆయన కుటుంబసభ్యులు, సన్నిహితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం’ అని భారత్‌కు అమెరికా రాయబారి కెన్నెత్‌ జస్టర్‌ ట్వీట్‌ చేశారు.

 ‘ఓ గొప్ప నేత, రాజనీతజ్ఞుడిని భారత్‌, భారతీయ జనతాపార్టీ కోల్పోయింది. పారికర్‌ రాజకీయ, సామాజిక జీవితం ఎందరికో ఆదర్శప్రాయం. ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాం’ అని రష్యా రాయబారి నికోలే కుదాషెవ్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.