దిగవంత గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ పార్థివదేహాన్ని ప్రస్తుతం పనాజీలోని బిజెపి కార్యాలయానికి తీసుకొచ్చారు. పార్టీ శ్రేణులు, ప్రజలు నివాళులర్పించిన అనంతరం కాలా అకాడమీకి ప్రజల సందర్శన కోసమై తరలిస్తున్నారు.
అక్కడ నుంచి సాయంత్రం 4 గంటలకు పారికర్ అంతిమయాత్ర ప్రారంభం కాగా.. 5 గంటలకు మిరామర్ బీచ్లో అంతిమ సంస్కారాలు సైనిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ మేరకు అంత్యక్రియలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలంటూ కేంద్ర హోంశాఖ.. రక్షణశాఖను కోరింది. మిరామర్ బీచ్లో గోవా తొలి ముఖ్యమంత్రి దయానంద్ బండోద్కర్ స్మారకం పక్కనే పారికర్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి తెలిపారు.
కేంద్ర మంత్రివర్గం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమై పారికర్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. గోవా ముఖ్యమంత్రిగా, రక్షణ మంత్రిగా ఆయన అందించిన సేవలను కొనియాడింది. సోమవారం దేశం అంతటా సంతాప దినంగా పాటించాలని నిర్ణయించింది.
పారికర్ అంత్యక్రియలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరవుతున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గోవాలో ఉన్నారు.