లోకేష్ గెలుపుపై నమ్మకం లేని చంద్రబాబు !

ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయనిది తన రాజకీయ వారసుడిగా ముఖ్యమంత్రి పదవి చేపట్టడం కుదరదని తప్పని పరిస్థితులలో కొడుకు నారా లోకేష్ ను మంగళగిరి నుండి అసెంబ్లీ ఎన్నికలలో అభ్యర్థిగా పోటీకి దించుతున్న ఆయన గెలుపుపై తండ్రి చంద్రబాబు నాయుడుకు నమ్మకం లేదా ? ఇదే ప్రశ్న ఇప్పుడు తెలుగు దేశం వర్గాలను కలచి వేస్తున్నది.

ఎమ్యెల్సీ లుగా ఉన్న నెల్లూరు జిల్లాల్లో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కడప జిల్లాలో రామసుబ్బారెడ్డి లను అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయించాలని నిర్ణయించగానే వారితో శాసన మండలి సభ్యత్వాలకు రాజీనామా చేయించారు. ఇంకా ఎన్నికల షెడ్యూల్ కూడా ప్రకటించకుండానే చాలా ముందుగా రాజీనామా చేయించారు.  అప్పుడే వారితో పాటు ఎమ్యెల్సీగా ఉన్న లోకేష్ తో రాజీనామా చేయించక పోవడంతో ఎమ్యెల్యేగా పోటీ చేయించే విషయంలో ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదేమో అని అనుకున్నారు.

కానీ, ఇప్పుడు అభ్యర్థిగా ప్రకటించడమే కాదు ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించిన లోకేష్ తో ఎమ్యెల్సీగా రాజీనామా చేయించక పోవడం ఏమిటనే ప్రశ్న తలెత్తుతుంది. సోమిరెడ్డి, రామసుబ్బారెడ్డిలకు వర్తించే నిబంధనలు ముఖ్యమంత్రి కుమారుడు కావడంతో లోకేష్ కు వర్తించవా అనే సందేహాలు కలుగుతున్నాయి.

లోకేష్ తో పాటు మరో మంత్రి డా. పి నారాయణ కూడా ఎమ్యెల్యేగా పోటీ చేస్తున్నా ఆయనతో కూడా ఎమ్యెల్సీగా రాజీనామా చేయించనే లేదు. వీరిద్దరికి మొదటి జాబితాలోనే పార్టీ సీట్లను ఖరారు చేశారు. వీరితో పాటు చీరాల నుండి పోటీకి దించుకున్న కరణం బలరామకృష్ణ మూర్తి కూడా ఎమ్యెల్సీగా ఉన్నారు. ఆయనతో కూడా రాజీనామా చేయించే ఆలోచన ఉన్నట్లు లేవు.

వీరందరి గెలుపు పట్ల నమ్మకం లేక ముఖ్యమంత్రి రాజీనామా చేయించడం లేదా లేదా వారికి పార్టీలో ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటి వరకు లోకేష్ ను పెద్దగా ఎన్నికల ప్రచారంలో తిప్పడం లేదు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార  సారధ్య బాధ్యతలు అప్పచెప్పగా ఒక్క డివిజన్ కె పార్టీ పరిమితం కావలసి రావడంతో అప్పటి నుండి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచుతున్నారు. నంద్యాల ఉపఎన్నికలో కూడా ప్రచారంలో పాల్గొనలేదు.

ఇప్పుడు కూడా లోకేష్ ప్రచారాన్ని మంగళగిరికి పరిమితం చేయనున్నట్లు కనిపిస్తున్నది. ప్రచారంలో యధాలాపంగా మాట్లాడుతూ ఉంటె ప్రయోజనం కన్నా నష్టమే ఎక్కువగా జరగవచ్చని ఆందోళన టిడిపి వర్గాలలో వ్యక్తం అవుతున్నది.