దేశ గమనాన్ని మార్చిన రెండు కీలక నిర్ణయాల్లో పారికర్ !

దేశ రాజ‌కీయాల్లో మ‌రో ద్రువ‌తార రాలిపోయింది. గోవా సముఖ్యమంత్రి , మాజీ ర‌క్ష‌ణ మంత్రి మనోహర్ పారిక‌ర్ మరణంతో దేశం ఒక అరుదైన నిజాయతీకి, అంకిత భావానికి పేరెన్నిగన్న ఒక గొప్ప నేతను దేశం కోల్పోయింది. ముంబై ఐఐటీ లో డిగ్రీ పొంది ముఖ్యమంత్రిగా రావడం వరకు ఆయన జీవితం అంతా దేశం కోసం ఆర్ద్రత, జాతి సేవలో ధరించాలనే తాపత్రయం కనిపిస్తుంది. నిరాడంబరతకు మారుపేరు. ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా విమానాలలో సాధారణ ప్రయాణికుడివలె ప్రయాణించారు. రక్షణ మంత్రిగా ఉంటూ గోవాలో స్నేహితులతో కలసి మామలు రెస్టారెంట్ లకు వెడుతూ ఉండేవారు. 

దేశ గమనాన్ని మార్చిన రెండు ముఖ్య ఘటనలలో ఆయన నిర్ణయాత్మక పాత్ర వహించారు. మొదటగా నరేంద్ర మోదీని బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా అంగీకరించేటట్లు చేయడంలో కీలక పాత్ర వహించారు. తర్వాత 2016లో పాకిస్థాన్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లో భార‌త ఆర్మీ స‌ర్జిక‌ల్ దాడులు నిర్వ‌హించిన సమయంలో ఆయన స్వయంగా పర్యవేక్షణ జరిపారు. 

యురి సెక్టార్‌పై ఉగ్ర‌వాదులు దాడి చేసిన ఘ‌ట‌న‌కు ప్ర‌తీకారంగా భార‌త్ స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్స్ నిర్వ‌హించింది. అయితే ఆ స‌ర్జిక‌ల్ దాడుల స‌మ‌యంలో మ‌నోహ‌ర్ పారిక‌ర్ ర‌క్ష‌ణ మంత్రిగా ఉన్నారు. ఆ ర‌హ‌స్య ఆప‌రేష‌న్‌లో పారిక‌ర్ కీల‌క పాత్ర పోషించారు. స‌ర్జిక‌ల్ దాడులు జ‌రిగిన స‌మ‌యంలో లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ డీఎస్ హూడా.. నార్త‌ర్న్ ఆర్మీ క‌మాండ‌ర్‌గా ఉన్నారు. క‌మాండ‌ర్ హూడా.. మాజీ ర‌క్ష‌ణ మంత్రి పారిక‌ర్‌ను విశేషంగా కొనియాడారు. స‌ర్జిక‌ల్ దాడుల గురించి పారిక‌ర్ తీసుకున్న నిర్ణ‌యాల‌ను ఆయ‌న గుర్తు చేశారు. 

పారిక‌ర్ చాలా ప‌దునైన‌, బ‌ల‌మైన నిర్ణ‌యాలు తీసుకునేవార‌ని అన్నారు. ఏ స‌మ‌స్య‌నైనా పారిక‌ర్ త్వ‌ర‌గా ఆక‌ళింపు చేసుకునేవార‌న్నారు. సైనికుల అవ‌స‌రాల‌ను వెంట‌నే తీర్చేవార‌న్నారు. ర‌క్ష‌ణ మంత్రిగా పారిక‌ర్‌.. సైనికుల‌తో నేరుగా మాట్లాడేవారన్నారు. స‌ర్జిక‌ల్ దాడులు స‌క్సెస్ కావ‌డంలో పారిక‌ర్ పాత్ర చాలా ఉంద‌ని క‌మాండ‌ర్ హూడా చెప్పారు.

2014 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ త‌ర‌పున ప్ర‌ధాని అభ్య‌ర్థిగా ఎవ‌రు నిల‌బ‌డాల‌న్న అంశంపై అప్ప‌ట్లో సందిగ్ధం నెల‌కొన్న‌ది. అయితే అప్పుడు పీఎం ప‌ద‌వి కోసం న‌రేంద్ర మోదీ పేరును ప్ర‌క‌టించ‌డానికి స‌హ‌క‌రించిన వ్య‌క్తుల్లో పారిక‌ర్ కీల‌కంగా నిలిచారు. 2013లో గోవాలోనే బీజేపీ జాతీయ స‌మావేశాలు జ‌రిగాయి. అక్క‌డే ప్ర‌ధాని అభ్య‌ర్థిగా న‌రేంద్ర మోదీ పేరును ప్ర‌క‌టించారు. అక్క‌డ జ‌రిగిన అనేక ప‌రిణామాల్లో పారిక‌ర్ పాత్ర చాలా ఉన్న‌ది.

వాస్తవానికి బిజెపి నాయకత్వం నూతన తరానికి మారాలని నితిన్ గడ్కరీని పార్టీ అధ్యక్షుడిగా చేసిన సమయంలో ఆ పదవికి ముందుగా పారికర్ పేరునే పరిగణలోకి తీసుకున్నారు. అయితే అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండడంతో గడ్కరీకి ఆ పదవి వరించింది. పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా పెర్గినలోకి వచ్చిన పేర్లలో ఆయన కూడా ఉన్నారు. 

మోదీని పీఎం అభ్య‌ర్థిగా తీసుకువ‌చ్చేందుకు పారిక‌ర్ తెర‌వెనుక చాలా గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేశారు. వాస్త‌వానికి ఆ మీటింగ్‌లో ఎల్‌కే అద్వానీ పేరు ప్ర‌క‌టిస్తార‌ని భావించారు. కానీ మోదీ పీఎం అభ్య‌ర్థిగా తేలారు. ఇక ఎన్నిక‌ల ప్ర‌చార బాధ్య‌త‌లు కూడా మోదీకి ద‌క్కే విధంగా పారిక‌ర్ కృషి చేశారు. గోవాను అనూహ్య రీతిలో మార్చిన సీఎంగా పారిక‌ర్ మంచి పేరుంది. ముఖ్యమంత్రిగా, రక్షణ మంత్రిగా ఆయన పనితీరును ఏ పార్టీ వారు కూడా ఏ సందర్భంలో కూడా తప్పు పట్టక పోవడం గమనార్హం. అందుకనే చాల అరుదైన నేత అని చెప్పవచ్చు.