సుస్థిర ప్రభుత్వానికే ప్రజలు పట్టం గడతారు

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో సుస్థిర ప్రభుత్వానికే ప్రజలు పట్టం కడతారన్న నమ్మకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యక్తం చేశారు. ప్రస్తుతం అనేక ప్రతిపక్ష పార్టీలు బీజేపీని ఓడించాలన్న లక్ష్యంతో జతకట్టడం అన్నది అస్థిర భారతానికే కారణం అవుతుందని ఆయన హెచ్చరించారు. విధానాల పరంగానూ, సైద్ధాంతికంగానూ ఏ రకంగానూ పొంతనలేని రాజకీయ పార్టీలు నాయకులు జతకట్టడం రాజకీయ అస్థిరతకు దారితీస్తుందని జైట్లీ స్పష్టం చేశారు.

అజెండా 2019 అనే అంశంపై ఏడో దఫాగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన జైట్లీ ‘ఎన్నికలు జరిగిన ప్రతీసారి భారతీయులకు స్థిరమైన ప్రభుత్వాన్ని, అస్థిర కూటమిని ఎన్నుకునే అవకాశం లభిస్తూనే వచ్చింది. ఈ సారి ప్రజలు అర్నెల్లే పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారా? లేక ఐదేళ్లు బలంగా సాగే ప్రభుత్వానికే పట్టం కడతారా? అలాగే తన పాలనా పటిమను చాటుకుని ఐదేళ్లపాటు ప్రభుత్వాన్ని నడిపిన నాయకుడిని ఎన్నుకుంటారా లేక అసలు నాయకుడే లేని కూటమికే పట్టం కడతారా?’అని పేర్కొన్నారు. అయితే నేటితరం ప్రజలు అన్ని అంశాలను బెరీజు వేసుకొని దక్షత పాటవం ప్రతిభ కలిగిన నాయకుడినే ఎన్నుకోగలరన్న నమ్మకం తనకు ఉందని జైట్లీ చెప్పారు.

ప్రస్తుతం ఎన్నికల్లో బీజేపీ ప్రచార విభాగం సారధిగా కూడా కొనసాగుతున్న జైట్లీ ప్రతిపక్ష కూటమి ఐక్యతా ప్రయత్నాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీని ఓడించడమే ప్రతిపక్షాల మహాకూటమి ఏకైక లక్ష్యమని ధ్వజమెత్తిన జైట్లీ వారి ప్రయత్నాలన్నీ అస్థిరతకే దారి తీస్తాయని దేశాన్ని మరింతగా కుంగదీస్తాయని తెలిపారు. బీజేపీలో మోదీ నాయకత్వానికి తిరుగులేదని అదే ప్రతిపక్ష కూటమికి నాయకుడే లేడని వ్యంగోక్తి విసిరారు. పైగా ఈ కూటమి నేతల్లో నలుగురు ఇప్పటికే ప్రధాని పదవి చేపట్టాలన్న బలమైన ఆకాంక్షను వ్యక్తం చేశారని జైట్ ఎద్దేవా చేశారు.

సైద్ధాంతిక బలంలేని ఏ ప్రభుత్వాలు స్థిరంగా కొనసాగలేవనీ, గతంలో అనేక పార్టీల కలయికగా ఏర్పడ్డ సంకీర్ణ ప్రభుత్వాలు కొన్ని నెలలకే పరిమితం అయ్యాయని జైట్లీ గుర్తు చేశారు. చరణ్‌సింగ్, వీపీ సింగ్, దేవెగౌడ, ఐ.కె గుజ్రాల్ సారథ్యంలోని ప్రభుత్వాలు పూర్తి కాలం పాటు కొనసాగిన దాఖలాలే లేవని తెలిపారు. రాజకీయ స్థిరత్వం లేని భారతావనిలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రారని స్పష్టం చేశారు. చివరికి భారత్ పెట్టుబడుదారులు సైతం స్థిరమైన రాజకీయ వాతావరణం దేశాల్లోని పెట్టుబడులకు ప్రాధాన్యతనిస్తారని పేర్కొన్నారు.