గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కన్నుమూశారు. గత కొంత కాలంగా క్లోమ గ్రంథి క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి ఆదివారం విషమించింది. దీంతో ఆయనకు చికిత్స అందించేందుకు వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
మనోహర్ పారికర్ తొలిసారి 1994లో గోవా శాసనసభకు ఎన్నికయ్యారు. 1999లో గోవా శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. 2000, అక్టోబరు 24న తొలిసారిగా గోవా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఐఐటిలో ఉన్నత విద్య అభ్యసించిన వ్యక్తి ముఖ్యమంత్రి పదవి చేపట్టడం దేశంలో తొలిసారి. ఇప్పటి వరకు మరెవ్వరు ఈ పదవిని చేపట్టలేదు.
2002 ఫిబ్రవరి 27 వరకు ఆ పదవిలో ఉన్న పారికర్ మళ్ళీ 2002 జూన్ 5న మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2005 జనవరిలో నలుగురు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు రాజీనామా చేయడంతో మైనారిటీలో పడ్డ ప్రభుత్వాన్ని కూడా తన చతురతతో నెట్టుకొచ్చారు.
ఆ తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి, దిగంబర్ కామత్‌కు సీఎం అయ్యారు. అయితే, 2012 శాసనసభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ మెజారిటీ సాధించడంతో మరోసారి పారికర్ గోవా ముఖ్యమంత్రి అయ్యారు.
గోవాకు మూడుసార్లు సీఎంగానే కాకుండా రక్షణ మంత్రిగా కూడా పారికర్ సేవలందించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ట్విటర్ ద్వారా పారికర్‌కు నివాళులర్పించారు. పారికర్ సేవలను కొనియాడారు. నవంబర్, 2014 నుండి మార్చ్, 2017 వరకు కేంద్ర రక్షణ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఉత్తర ప్రదేశ్ నుండి రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు.
బాల్యంలోనే ఆర్ ఎస్ ఎస్ లో చేరిన ఆయన ఉత్తర గోవాలో క్రియాశీలకంగా పనిచేశారు. 26 ఏళ్ళ వయస్సులోనే స్థానికంగా సంఘ చాలాక్ అయ్యారు. రామజన్మభూమి ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న నిరాడంబర జీవనం గడిపేవారు.
2014 ఎన్నికలకు ముందు గోవాలో 2013లో జరిగిన బిజెపి సదస్సులో ప్రధాన మంత్రి పదవికి నరేంద్ర మోదీ పేరును ప్రతిపాదించింది ఆయనే. 1955 డిసెంబర్ 13న గోవాలోని మాపూసలో జన్మించిన ఆయనకు భార్య మేధా 2001లోనే మృతి చెందారు. ఆయనకు ఇద్దరు పిల్లలు -ఉత్పల్, అభిజిత్.
మనోహర్ పారికర్ క్లోమ గ్రంథి క్యాన్సర్‌తో సంవత్సరంకు పైగా బాధపడుతున్నారు. దీంతో ఆయన కొద్దిరోజుల పాటు అమెరికాలో చికిత్స పొందారు. దిల్లీలోని ఎయిమ్స్, గోవా, ముంబయిలోనూ ఆయన చికిత్స తీసుకున్నారు. అయితే గతనెలలో మళ్లీ అనారోగ్యానికి గురికావడంతో అప్పటి నుండి వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు.