ప్రియాంక వల్ల ఎలాంటి నష్టం లేదు : యోగి ఆదిత్యనాథ్

కాంగ్రెస్ తురుపుముక్క ప్రియాంక గాంధీ  క్రియాశీల  రాజకీయాల్లోకి రావడం వల్ల ఉత్తర ప్రదేశ్ లో  బీజేపీకి ఎలాంటి నష్టంలేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం యోగి ఆదిత్యానాథ్ స్పష్టం చేశారు. గతంలో కూడా ఆమె పార్టీ ప్రచారంలో పాల్గొన్నారని, ఈ ఎన్నికల్లో కూడా ఆమె ప్రభావం ఏమీ ఉండదని తెలిపారు. పైగా కాంగ్రెస్‌లో ప్రియాంకా గాంధీ నాయకత్వ బాధ్యతలు స్వీకరించడమనే అంశం ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని చెప్పారు. 

కాగా,  ఎస్పీ, బీఎస్పీ కూటమిపై కూడా ఆయన మండిపడ్డారు. అధికారం కోసమే ఇద్దరూ కలిసి పోటీచేస్తున్నారని విమర్శించారు వారు పొత్తు విఫలమవుతుందని చెబుతూ ఆ కూటమికి ప్రజల మద్దతు లేదని స్పష్టం చేశారు. రాజకీయ దివాళాకోరు సిద్ధాంతాలకు ఎస్పీ, బీఎస్పీ కూటమి నిలయమని ధ్వజమెత్తారు.  

ఎస్పీ, బీఎస్పీ కూటమి తమ పార్టీ ఓటు బ్యాంకు కు  ఎలాంటి నష్టం చేకూర్చలేదని ధీమా వ్యక్తం చేశారు. కొన్ని సీట్లలో ఎవరు పోటీ చేయాలన్న అంశంపై ఆ రెండు పార్టీల మధ్యనే అంతర్గత పోరు సాగుతున్నదని చెప్పారు. ఆ కూటమి వల్ల బీజేపీకి నష్టం జరుగుతుందన్నది తప్పుడు అంచనా మాత్రమే అని పేర్కొన్నారు. 

లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్ర స్థాయి సమస్యలకు ప్రాధాన్యం తక్కువగా ఉంటుందని తెలిపారు. 2014లో మోదీ నామ్ (పేరు) చూసి ఓటు వేశారని, ఈసారి ఆయన కామ్ (పని) చూసి గెలిపిస్తారని యోగి విశ్వాసం వ్యక్తం చేశారు.  

 దేశం కోసం అహర్నిశలు కష్టపడుతున్న ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో బీజేపీకి ఓట్లు వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, బీజేపీకి ఘన విజయం లభిస్తుందని యోగి భరోసా వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపి, పాకిస్తాన్‌కు వైమానిక దాడుల ద్వారా బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. బీజేపీకి సాటి వచ్చే విపక్షాలు దేశంలో లేవని ధీమా వ్యక్తం చేశారు. 

పుల్వామా దాడికి ధీటైన జవాబు ఇచ్చిన ఘనత మోదీకే దక్కుతుందని చెబుతూ  శత్రు దేశం గుండెల్లో రైళ్లు పరుగెత్తించారని పేర్కొన్నారు. బలమైన నాయకత్వం వల్లనే వైమానిక దాడులు చేయడం సాధ్యమైందని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్‌ను ఒంటరిని చేసి ఆ దేశ దుష్టప్రచారానికి అడ్డుకట్టవేశామని చెప్పారు. 

సుపరిపాలన, అవినీతి నిర్మూలన, రైతాంగానికి మేలు చేసే ప్రయోజనాల వల్ల ప్రజలు మోదీ నాయకత్వానికి బ్రహ్మరథం పడుతున్నారని ఆదిత్యనాథ్ తెలిపారు. దేశంలో విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చినా, ప్రజలు నమ్మరని అంటూ ఈ పార్టీలకు సమర్ధమైన నాయకత్వం, సిద్ధాంతాలు లేవని దుయ్యబట్టారు. ఈ పార్టీలకు కూడా ఒకరిపట్ల ఒకరికి నమ్మకం లేదన్నారు. 

గత ఎన్నికల్లో యుపిలో బీజేపీకి 80 లోక్‌సభ సీట్లకు 74 సీట్లు వస్తే, ఈ సారి స్వీప్ చేస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. తమ పార్టీకి మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో కూడా బంపర్ మెజార్టీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

 ఎంపీ, చత్తీస్‌ఘడ్‌లో తమ పార్టీ 15 సంవత్సరాల నుంచి అధికారంలో ఉండడం వల్ల ప్రభుత్వ వ్యతిరేకత వల్ల గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చాయని తెలిపారు. అయితే  ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్‌కు చేదు అనుభవం ఎదురవుతుందని స్పష్టం చేశారు. దేశాభివృద్ధి, భద్రత, సంక్షేమం కోసం ప్రజలు బీజేపీకి ఓటువేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.