కెసిఆర్ ని చిక్కుల్లోకి నెట్టేస్తున్న కొత్త జోనల్ విధానం

అధికారంలోకి రాగానే ప్రభుత్వంలో ఉన్న రెండు లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు నాలుగున్నరెళ్ళు పదవీకాలంలో ఈ విషయమే చెప్పుకోదగిన ప్రయత్నం చేయక పోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతున్నది. ఈ అసంతృప్తి ముందస్తు ఎన్నికలకు సన్నాహాలు చేస్తున్న తనకు ముప్పుగా మారగలదని గ్రహించిన కెసిఆర్ హడావుడిగా ప్రధాని నరేంద్ర మోడిని కలసి కొత్త జోనల్ విధానానికి ఆమోద ముద్ర వేయించుకో గలిగారు.

దానితో యువతకు వేలకొలది ఉద్యోగాలు రాబోతున్నాయని అంటూ, తక్షణమే 50 ఉద్యోగాల భర్తీకి కసరత్తు చేస్తున్నామంటూ సంకేతాలు ఇస్తూ వచ్చారు. అయితే ఆచరణలో కొత్త జోనల్ విధానం చట్టబద్దత గురించి పలు వర్గాలలో అనుమానాలు చెలరేగుతు ఉండడంతో కెసిఆర్ ప్రభుత్వాన్ని చిక్కుల్లోకి నెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జోనల్ విధానం అడ్డుగా ఉండడంతో ఇప్పటి వరకు పలు ఉద్యోగాలను నింపలేక పోతున్నట్లు యువకుల ముందు అమాయకంగా మొఖం పెట్టె ప్రయత్నం చేశారు.

ఒక వైపు విద్యార్థులు దీనికి పూర్తిస్ధాయి చట్టభద్రత  కల్పించాలని ఉద్యమానికి తయారవుతుంటే, మరో వైపు ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. ఇంకో వైపు న్యాయకోవిదులు ఈ కొత్త జోనల్ విధానానికి ఏమాత్రం న్యాయబద్ధత లేదని స్పష్టం చేస్తున్నారు. ముందు రాష్ట్రంలో 31 జిల్లాలకై పార్లమెంటులో మూడింట రెండవంతుల  మెజారిటీతో ఆమోదముద్ర వేయించుకుని కొత్త జిల్లాల వ్యవస్ధకు శాస్త్ర బధ్దత కల్పించాలని పలువురు సూచిస్తున్నారు.

ఇప్పటి వరకు కేసీఆర్ కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలకు కేంద్రం నుండి ఆమోద ముద్ర లభించలేదు. చట్టబద్దత లేని జిల్లాలతో ఏర్పాటు చేసిన జోనల్ విధానం ఏ విధంగా న్యాయబద్దం కాగలదని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అందుకనే ఈ కొత్త జోనల్, మల్టీ జోనల్ విధానాన్ని శాస్రీయబద్దతతో  ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కేసీఆర్ ప్రగతి నివేదన పేరుతో భారీ బహిరంగ సభ జరిపిన రోజుననే రాష్ట్రంలోని విద్యార్థి సంఘాలు సెప్టెంబర్ 2వ  తేదీన  ఉస్మానియా విశ్వవిద్యాలయంలో  ‘విద్యార్థి నిరుద్యోగుల ఆవేదన‘  సభ ఏర్పాటు చేశారు.

 రాష్ట్ర క్యాడర్ ఉద్యోగాలైన గ్రూప్1, ఇతర రాష్ట్ర స్థాయి ఉద్యోగాలను పదోన్నతులద్వారా కాకుండా ప్రత్యక్ష నియామకాల ద్వారా చేపట్టి కొత్త జోనల్ వ్యవస్థ పై నిరుద్యోగులకు నమ్మకం కలిగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ ఫ్రీజోన్ అన్నందుకే 14 (ఎఫ్) కి వ్యతిరేకంగా ఉస్మానియా యూనివర్సిటీ లో ఉద్యమం రగిలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి దారి తీసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.

జోనల్ విధానంపై రాష్ట్రపతి ప్రకటన చేసిన సమయంలోనే తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన టీచర్ల ఏకీకృత సర్వీస్ రూల్స్ చెల్లవని రాష్ట్ర హైకోర్టు తేల్చిచెప్పడం గమనార్హం. ఈ విషయమై ప్రభుత్వం నోరు విప్పే సాహసం చేయలేక పోతున్నది. మరోవంక, రాష్ట్ర సచివాలయ ఉద్యోగులతో సహా, రాష్ట్రంలోని అనేక జిల్లాలోని ఉద్యోగులు కూడా ఈ కొత్త జోనల్ వ్యవస్థకు శాస్త్రీయత లేదని, అందు కోసం తాము న్యాయస్ధానాన్ని ఆశ్రయిస్తామని చెబుతున్నారు.

గత నెలలోనే  స్వయానా రాష్ట్ర హై కోర్ట్ ఆర్టికల్ 371 (డీ) విషయంలో రాష్ట్రపతి కూడా జోక్యం చేసుకోలేరని ప్రకటిస్తే, ఇప్పుదు ఇదే ఆర్టికల్ 371 (డీ) ని తిరిగి ఎలా సవరించి నూతన జోనల్ విధానానికి ఆమోద ముద్ర వేసారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.

ఇలా ఉండగా,  హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండగా జోనల్ వ్యవస్ధలో రాజధానిని ఎలా కలుపుతారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. పదేళ్లలో ఇప్పటికే నాలుగున్నరేళ్ల కాలం గడిచిపోయినందున, మరో ఐదున్నరేళ్లు టీఆర్‌ఎస్ సర్కార్ గ్రేటర్ హైదరాబాద్‌ను జోనల్ వ్యవస్ధ నుంచి మినహాయించాలనీ, లేదా ఫ్రీజోన్‌గా పెట్టాలన్న అభ్యంతరాన్ని ఏపీ అధికారులు వ్యక్తపరుస్తున్నారు.