చైనా ముందు భారత్‌ను కించపరుస్తున్నారంటూ నటుడు మాధవన్

 

కాంగ్రెస్‌పై నటుడు మాధవన్ మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఇద్దరూ కలిసి ఉన్న మీమ్‌ వీడియోను కాంగ్రెస్‌ నిన్న సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసింది. ఇది కాస్తా వైరల్‌గా మారింది. దీంతో ఈవీడియోపై మాధవన్‌ స్పందించారు.

‘ఇది మంచి పద్ధతి కాదు. రాజకీయ పార్టీల మధ్య ఎలాంటి విభేదాలున్నప్పటికీ నరేంద్ర మోదీ మన దేశానికి ప్రధాని. మీరు చైనా ముందు భారత్‌ను కించపరుస్తున్నారు. ఈ వీడియోలో అలాగే చేశారు. కాంగ్రెస్‌ ట్విటర్‌ ఖాతా నుంచి ఇలాంటి పోస్టులు ఊహించలేదు’ అని ట్వీట్‌ చేశారు. అయితే మాధవన్‌ ట్వీట్‌ కూడా వైరల్‌ కావడంతో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ప్రధాని మోదీ బలహీనమైన వ్యక్తి అని, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను చూసి ఆయన భయపడుతున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ విమర్శించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రోజే కాంగ్రెస్‌ ఈ వీడియోను సైతం పోస్ట్‌ చేసింది. రాహుల్‌ విమర్శలకు బీజేపీకి  కూడా దీటుగానే బదులిచ్చింది. 

కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ కూడా మసూద్‌ అంశంపై కాంగ్రెస్‌ నేతలకు పరోక్షంగా చురకలంటించారు. కాంగ్రెస్‌ హయాంలో మసూద్‌ ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు భారత్‌ ఒంటరిగా ఉందని, కానీ ఇప్పుడు ప్రపంచ దేశాలు మనకు మద్దతిస్తున్నాయని ఆమె గుర్తు చేశారు.  మరోవైపు భారతీయ జనతా పార్టీ ఈ వీడియోపై స్పందించింది. భారత్‌ను ఇబ్బంది పెట్టేలా చైనా ప్రవర్తిస్తుంటే విచారం వ్యక్తం చేయాలి గానీ ఇలా అపహాస్యం చేయడం ఏంటని ట్విటర్ ద్వారా ప్రశ్నించింది.