పౌరసత్వ బిల్ పై వెనుకకు తగ్గే ప్రసక్తే లేదు

అస్సాం జాతీయ పౌర జాబితా సవరణ (ఎన్నార్సీ)బిల్లుపై తమ నిర్ణయంలో ఎలాంటి మార్పూ లేదని, ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అస్సాం ఆర్థిక మంత్రి హేమంత బిశ్వాస్ శర్మ తేల్చి చెప్పారు. అస్సాం గణపరిషత్, బీజేపీ మధ్య తిరిగి పొత్తు పొడుచుకోవడంతో ఈ నిర్ణయంలో ఏదైనా మార్పు ఉంటుందా? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ విషయంపై ఆయన స్పష్టత ఇచ్చారు. 

జాతీయ పౌర జాబితా సవరణ బిల్లును తీసుకురావడానికి తాము ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని, ఈ విషయాన్ని తాము ఇప్పటికే అనేక సార్లు స్పష్టం చేశామని ఆయన తేల్చి చెప్పారు. మోదీ సారథ్యంలో అస్సాంతో పాటు ఈశాన్య రాష్ట్రాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, సుసంపన్నం చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని హేమంత్ పునరుద్ఘాటించారు. 

ఎన్నికలు ముగియగానే ఇరు పార్టీల నేతలు కూర్చోని ఈ విషయంపై చర్చిస్తామని తెలిపారు. ఈ విషయంలో అస్సాం గణపరిషత్ ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గదని, తమ నిర్ణయంలో సైతం ఎలాంటి మార్పూ ఉండదని మంత్రి హేమంత్ బిశ్వాస్ తెగేసి చెప్పారు.

కాగా,  బీజేపీ నేతలు మహేంద్ర సింగ్, రంజిత్ దాస్ తదితరులు అస్సాం గణపరిషత్ పార్టీ కార్యాలయానికి వెళ్లి మర్యాద పూర్వకంగా ఆ పార్టీ నేతలను కలుసుకున్నారు. మరుసటి రోజున ఏజీపీకి సంబంధించిన ముగ్గురు మంత్రులు బీజేపీ కార్యాలయానికి వెళ్లి మర్యాదపూర్వకంగా బీజేపీ నేతలను కలుసుకున్నారు. 

ఏజీపీ, బీజేపీ పొత్తుతో రాష్ట్రంలో కచ్చితంగా 12 సీట్లను సాధిస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు. తిరిగి నరేంద్ర మోదీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టడానికి ఇరు పార్టీల నేతలు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని వారు తెలిపారు. క్షేత్ర స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా, ఇరు పార్టీల కార్యకర్తలు పనిచేయడానికి తగిన వాతావరణం ఏర్పడాలని ఇరు పార్టీల నేతలు ఆయా పార్టీల కార్యాలయాలకు వచ్చామని ఏజీపీ నేత అతుల్ బోరా తెలిపారు.