ఆసియా క్రీడలలో భారత్ కు బంగారు పతాకాల పంట

ఇండోనేషియాలో ముగిసిన ఆసియా క్రీడోత్సవాల నుండి భారత్ క్రీడాకారుల బృందం 69 పథకాలతో తిరిగి వచ్చింది. 1951లో ప్రారంభమైన ఆసియా క్రీడోత్సవాలలో గతంలో ఎన్నడూ లేనన్ని పతకాలను పొంది చరిత్ర సృష్టించారు. మొత్తం 15 బంగారం, 24 కాంస్య, 30 రాజిత పతాకాలను సాధించుకున్నారు. 1951లో 15 స్వర్ణాలు సాధించిన భారత్ తాజా క్రీడలలో 15 స్వర్ణాలతో ఆనాటి రికార్డును సమం చేయడం విశేషం.

2010లో గ్వాంగ్‌జులో జరిగిన ఆసియా క్రీడలలో ఓవరాల్‌గా 65 పతకాలతో భారత్ అత్యుత్తమంగా నిలిచింది. దీంతో ఇండోనేషియాలో ముగిసిన ఆసియా క్రీడలలో అత్యధిక పతకాలు సాధించిన రికార్డును భారత్ అందుకుంది. ఈ పర్యాయం చాలామంది యువకులు, అతి చిన్న వయస్సులోనే అత్యద్బ్బుత ప్రతిభను కనబరచి పతకాలను కైవసం చేసుకున్నారు. చాలామంది జాతీయ రికార్డులను అధిగమించారు. మనం ఎక్కువగా ఆశలు పెట్టుకున్న కబాడీ వంటి ఆటలలో నిరాశ ఎదురైనా పతాకాల సంఖ్య పెరగటం గమనార్హం. పైగా పలు ఆటలలో మొదటిసారిగా పతాకాలు సాధించారు.

హాకీ, మహిళల బాక్సింగ్‌తోపాటు పురుషుల బాక్సింగ్‌లోనూ ఫేవరెట్లు విఫలం కావడంతో స్వర్ణాల సంఖ్య తగ్గింది. శనివారం ఏషియాడ్‌లో చివరిరోజూ భారత అథ్లెట్లు స్వర్ణమోత మోగించారు. బాక్సింగ్ 49 కేజీల లైట్ వెయిట్ విభాగంలో అమిత్ పంఘాల్, బ్రిడ్జ్‌గేమ్ టీమ్ ఈవెంట్‌లో 60 ఏండ్ల ప్రణబ్ బర్దన్, 56 ఏండ్ల శిభ్‌నాథ్ సర్కార్‌తో కలిసి భారత్‌కు స్వర్ణాలు అందించారు.

కాగా, స్కాష్ మహిళల టీమ్ ఈవెంట్ ఫైనల్లో భారత మహిళల జోడీ పరాజయంతో రజతం అందుకోగా, దాయాది పాకిస్థాన్‌ను 2-1 గోల్స్‌తో చిత్తు చేస్తూ విజయంతో భారత హాకీ జట్టు కాంస్య పతకం అందుకుంది. దీంతో ఆసియా క్రీడల 14వ రోజు 2 స్వర్ణ, 1రజతం, 1 కాంస్యంతో మెరుగైన రికార్డుతో భారత్ పోటీలను మగించింది. జరిగే ముగింపు ఉత్సవాల కవాతు సందర్భంగా జాతీయపతాకధారిగా భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్ రాణిరాంపాల్ ఎంపికైంది.

చివరి రోజున ఒకేరోజు రెండు స్వర్ణాలు కైవసం చేసుకుని పతకాల పట్టికలో 8వ స్థానాన్ని నిలుపుకుంది. అంతా ఊహించినట్టే మిడిల్ వెయిట్ బాక్సింగ్‌లో భారత్ స్టార్ బాక్సర్ అమిత్ ఫంగల్ (49కేజీ) భారత్‌కు స్వర్ణాన్ని అందించాడు. భారత బాక్సింగ్ జట్టునుంచి ఫైనల్‌కు చేరింది 22ఏళ్ల ఆర్మీ కుర్రాడు అమిత్ ఒక్కడే.

గత వరల్డ్ టోర్నీ ప్రత్యర్థి, ఒలింపిక్ ఆసియా చాంపియన్ హసన్‌బోయ్ దుస్మతోవ్‌ను 3-2 స్కోరుతో మట్టికరిపించి అమిత్ పసిడిని ఒడిసిపట్టాడు. గతేడాది వరల్డ్ చాంపియన్ టోర్నీలో అమిత్‌ను మట్టికరిపించి దుస్మతోవ్ రజతాన్ని సాధించడం తెలిసిందే. ‘గతేడాది అతని చేతిలో ఓడాను. ఇప్పుడు ప్రతీకారం తీరుకున్నా' అని పేర్కొన్నారు.

గత ఆసియా క్రీడల్లో ప్రవేశపెట్టిన బ్రిడ్జి గేమ్‌లో భారత్ స్వర్ణం సాధించింది. పురుషుల పెయిర్ ఈవెంట్‌లో 60ఏళ్ల ప్రణబ్ బర్ధన్, 56 శిబ్‌నాథ్ సర్కార్ 384 పాయింట్లు సాధించి పసిడి పట్టుబడితే, 378 పాయింట్లతో చైనా, 374 పాయింట్లతో ఇండోనేసియా రజతం, కాంస్యం సాధించాయి. బ్రిడ్జి గేమ్‌లో భారత్ ఇప్పటికే రెండు రజతాలు సాధించడంతో, తాజా స్వర్ణంతో మూడు పతకాలు సాధించినట్టయ్యింది.

మహిళల స్క్వాష్‌లో ఫైనల్‌చేరి స్వర్ణంపై ఆశలు రేకెత్తించిన భారత జట్టు చివరకు రజతంతో సరిపెట్టుకుంది. పసిడి కోసం హాంకాంగ్ జట్టుతో అహరహం పోరాడినా, 0-2 ఫలితంతో చివరకు ఓటమిని అంగీకరించక తప్పలేదు.