అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన హీరో మోదీ

అసాధ్యాన్ని సుసాధ్యం చేసే హీరో ప్రధాని మోదీ అనే నినాదంతో జనంలోకి వెళ్లాలని బీజేపీ నిర్ణయించింది. హిందీ బెల్ట్‌లో మోదీ హై తోవ ముంకీన్ హై అనే నినాదాన్ని ఇవ్వనున్నారు. వచ్చే ఎన్నికల్లో జనంలోకి వెళ్లేందుకు బీజేపీ ప్రచారంలో అస్త్ర శస్త్రాలను తయారు చేసుకుంటోందని పార్టీ ప్రచార కమిటీ చైర్మన్, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. 

మోదీ గత ఐదేళ్లలో అహర్నిశలు అభివృద్ధి కోసం పనిచేశారని చెబుతూ త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడం, అమలు చేయడం మోదీకే సాధ్యమని జైట్లీ కొనియాడారు. గత ఐదేళ్లలో అసాధ్యమైన పనులను సుసాధ్యం చేసిన ఘనత మోదీకే దక్కుతుందని పేర్కొన్నారు. మోదీ బలమైన నేత అని పేర్కొంటూ ప్రతి భారతీయుడు ఈ రోజు మోదీ గొప్పతనాన్ని, పనితీరు, విశిష్టతను గుర్తించారని వెల్లడించారు. 

అనేక అంశాలపై మోదీ ఇంత త్వరగా నిర్ణయాలు తీసుకోవడంపై ప్రపంచ దేశాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయని జైట్లీ చెప్పారు. ప్రపంచంలో శరవేగంగా అభివృద్ధి చెందే దేశాల్లో భారత్ అగ్రగామిగా ఉందని పేర్కొన్నారు. దేశ రక్షణకు రాజీపడకుండా 2016, 2019లో వైమానిక దాడులను నిర్వహించి తన శక్తిని చాటిందని గుర్తు చేశారు. ఈబీసీలకు పదిశాతం కోటాను కేటాయించామని చెబుతూ దీని వల్లన  ఆర్థికంగా వెనకబడిన పేదలు లాభపడుతారని చెప్పారు. 

రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదును జమచేసి వ్యవసాయానికి ప్రోత్సాహం ఇస్తున్నామని జైట్లీ తెలిపారు. వస్తు సేవా పన్నును దేశ వ్యాప్తంగా అమలు చేస్తూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచామని కొనియాడారు. ఆరోగ్య బీమా పథకం ద్వారా పేదలకు వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు.