టిడిపి జాబితాలో వారసులకు పెద్ద పీట

తెలుగుదేశం పార్టీ  అధ్యక్షుడు చంద్రబాబునాయుడు 126 మందితో తమ ఎమ్మెల్యే అభ్యర్థుల మొదటి విడత  జాబితాలో వారసులకు పెద్ద పీట వేశారు. చంద్రబాబు కుటుంభం నుండి ముగ్గురు - ఆయనతో పాటు కుమారుడు లోకేష్ మంగళగిరి నుండి, బావమరిది నందమూరి బాలకృష్ణ హిందూపూర్ నుండి పోటీ చేస్తున్నారు. 

ఇక దివంగత కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడు కుటుంభం నుండి కూడా ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు. ఆయన కొడుకు రామ్మోహననాయుడు తిరిగి శ్రీకాకుళం నుండి ఎంపీగా పోటీ  చేస్తుండగా, మంత్రిగా ఉన్న సోదరుడు అచ్చంనాయుడుతో పాటు, ఎర్రన్నాయుడు కుమార్తె భవాని అత్తారిల్లు రాజమహేంద్రవరం నుండి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. 

ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి (పత్తికొండ) స్థానంలో ఆయన కుమారుడు కేఈ శ్యాంబాబుతో పాటు సోదరుడు కేఈ ప్రభాకర్ పోటీ చేస్తున్నారు. మంత్రి పరిటాల సునీత (రాప్తాడు) స్థానంలో ఆమె కుమారుడు శ్రీరాం, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి (శ్రీకాళహస్తి) స్థానంలో ఆయన కుమారుడు సుధీర్‌రెడ్డి, గౌతు శ్యాంసుందర శివాజీ (పలాస) స్థానంలో ఆయన కుమార్తె శిరీషకు అవకాశమిచ్చారు. 

జలీల్‌ఖాన్‌ (విజయవాడ పశ్చిమ) స్థానంలో ఆయన కుమార్తె షబానా ఖాతూన్‌, ఇటీవల మావోయిస్టుల కాల్పుల్లో మరణించిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు (అరకు) స్థానంలో ఆయన కుమారుడు, ప్రస్తుత మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌కు అభ్యర్థిత్వాలు దక్కాయి. దివంగత గాలి ముద్దుకృష్ణమ నాయుడి వారసుడు భానుప్రకాష్‌కు నగరి స్థానం లభించింది. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కిమిడి మృణాళిని (చీపురుపల్లి) స్థానంలో ఆమె కుమారుడు నాగార్జునకు అవకాశమిచ్చారు. దివంగత మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్‌కు గుడివాడ అభ్యర్థిత్వం దక్కింది.

ఎంపీలుగా పోటీ చేయించే ఉద్దేశంతో మంత్రులు కాల్వ శ్రీనివాసులు, శిద్ధా రాఘవరావు, ఆదినారాయణరెడ్డిలకు ఈ జాబితాలో చోటు కల్పించలేదు.   ఏడుగురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, ఐతాబత్తుల ఆనందరావు, పులపర్తి నారాయణమూర్తి, పీతల సుజాత, తెనాలి శ్రావణ్‌కుమార్, పాలపర్తి డేవిడ్‌రాజు, జయరాములుకు మొండిచేయి చూపి వారి స్థానాల్లో వేరే వారిని ఎంపిక చేశారు. 24 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు మొదటి జాబితాలో చోటు దక్కకపోవడం విశేషం. తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో మంత్రి కేఎస్‌ జవహర్‌కు పశ్చిమగోదావరి జిల్లాలో ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న కొవ్వూరును కాదని కృష్ణా జిల్లాలోని తిరువూరు సీటును కేటాయించారు.

కొవ్వూరు సీటును విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట సిట్టింగ్‌ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు కేటాయించారు.   వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన 22 మందిలో 13 మందికి టికెట్లు కేటాయించగా ముగ్గురిని పక్కన పెట్టారు.