ఆంధ్రులను వదిలేయండి కేసీఆర్.. ప్రజల మధ్య గొడవలు పెట్టకండి

"తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దణ్ణం పెడుతున్నా. రాష్ట్రానికి దొడ్డిదారిన కొంతమందిని పంపించి మాపై కక్ష సాధించవద్దు. ఇప్పటికే అలసిపోయాం.. ఇక పోరాడే ఓపికలేదు. చితికిపోయి వున్నాం. కేసీఆర్‌కు రెండు చేతులూ జోడించి వేడుకుంటున్నా దయచేసి ఆంధ్రులను వదిలేయండి. ఇరు రాష్ట్రాల్లోనూ ఆంధ్రులమే, అందరం ఒకటే అనే విషయాన్ని మర్చిపోకండి. ఇంకా ఎందుకు విషపూరిత మాటలు.. మా ప్రజల మధ్య గొడవలు పెట్టకండి" అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.  

జనసేన ఐదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చారిత్రాత్మక రాజమహేంద్రవరంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో  మాట్లాడుతూ "ఇంకా మాపై కక్ష ఎందుకు..? చాలా ఆవేదనగా వుంది" అంటూ కేసీఆర్ ను ప్రశ్నించారు. 

జగన్ టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నారంటే ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడిన వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను ఏ విధంగా కాపాడినట్టో జగన్ ఆలోచించాలన్నారు. కేసీఆర్ ఉద్యమ నాయకుడు, తెలంగాణా సాధించిన వ్యక్తిగా ఆయనపై చాలా గౌరవం వుంది, కానీ ఇంకా ఎందుకు రాష్ట్రాల మధ్య గొడవలు, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టి, ఆంధ్రులను చీకొడుతుంటే మిగిలిన పక్షాలు ఎందుకు బయటకు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

బీసీలకు వైఎస్ జగన్ అండగా ఉంటానని చెప్పడం కాదు కడప స్థానాన్ని బీసీలకు ఇవ్వగలరా అని ప్రశ్నించారు. కుటుంబాన్ని కాదని జగన్ మిగిలిన వారికి సీట్లు ఇవ్వగలరా అన్నారు.   

కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట మాటకీ మాట మార్చుకుండా మొదటి నుంచీ అండగా వుంటే ఇప్పటికే హోదా వచ్చేదని చెప్పారు. చంద్రబాబు పదే పదే మాట తప్పినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

తనకు భవిష్యత్ కల్పించాలని జగన్ అంటున్నారని, మీ భవిష్యత్‌ను నా చేతుల్లో పెట్టండి, ఆ తర్వాత కొడుకు చేతుల్లో పెట్టండంటూ చంద్రబాబు అడుగుతున్నారని, తాను మాత్రం నా భవిష్యత్‌ను వదులుకుని మీ భవిష్యత్ కోసం వచ్చిన వాడినని, ఈ ముగ్గురిలో ఎవరు బెటరో మీరే ఆలోచన చేయాలని, ఎవరికి ఓటేయ్యాల్లో మీరే ఆలోచించండి..మీరు ఎలాంటి తీర్పు ఇచ్చినా కడసారి వరకు మీ సేవలోనే వుంటానని జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ప్రజలకు ఈ వేదిక ద్వారా ఎన్నికల విజ్ఞప్తి చేశారు.