ముంబై దాడుల తర్వాత యుపిఎ ఏంచేసింది !

ముంబయిలో 26/11 దాడుల సంఘటన తర్వాత అప్పటి కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం అనుసరించాల్సిన విధానాలతో ముందుకు సాగలేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శించారు. ముంబయి దాడుల తర్వాత యూపీఏ ప్రభుత్వం ఉగ్రవాదుల పట్ల కఠినంగా వ్యవహరించి, నియంత్రించి ఉంటే ఇప్పటి పరిస్థితి మరోలా ఉండేదని ఆమె స్పష్టం చేశారు. 

బీజేపీ ఢిల్లీ విభాగం కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ బాలాకోట్‌లో వైమానిక దాడులను కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తున్న నేపథ్యంలో ఆమె ‘26/11 ముంబయి దాడుల తర్వాత అప్పటి యూపీఏ ప్రభుత్వం ఏమి చేసింది’ అంటూ ఆమె ప్రస్తావించారు. ఉగ్రవాదం ఏరూపంలో ఎదురైనా ఏమాత్రం నిర్లక్ష్యానికి ఆస్కారం ఇవ్వకుండా సమూలంగా నాశనం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఎల్లప్పడూ మాట్లాడుతుంటారని ఆమె పేర్కొన్నారు. 

బాలాకోట్‌లోని ఉగ్ర శిబిరాలపై ఇటీవల జరిగిన వైమానిక దాడుల గురించి మాట్లాడిన రక్షణ మంత్రి కార్గిల్ యుద్ధ సమయంలోనూ పాక్ సైనికులు ఎంతమంది హతమయ్యారన్న విషయమై ఆ దేశం స్పష్టత ఇవ్వలేకపోయిందని గుర్తు చేశారు. అదేవిధంగా ఇపుడు బాలాకోట్‌లోని టెర్రిరిస్టు శిబిరాలపై జరిగిన దాడిలో ఎంతమంది ఉగ్రవాదులు హతమయ్యారన్న దానిపై తగిన ఆధారాలు ఇస్తుందని ఆశించక్కర్లేదని ఆమె చెప్పారు. బాలాకోట్ దాడిలో హతమైన టెర్రరిస్టుల సంఖ్యను తాను ప్రస్తావించడం లేదని, అదేవిధంగా ఫలానా సంఖ్య అని చెప్పడానికి కూడా పాక్ నుంచి సమాధానం ఆశించలేమని ఆమె పేర్కొన్నారు. 

హతమైన టెర్రరిస్టుల సంఖ్యను చెప్పడానికి వారు ఎప్పుడూ ఒప్పుకోరని ఆమె తెలిపారు. 26/11 ముంబయి దాడుల సూత్రధారి అజ్మల్ కసబ్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడినా, అతను తమ దేశానికి చెందిన వ్యక్తేనని చెప్పడానికి పాక్ ఎప్పుడూ అంగీకరించలేదని కేంద్ర మంత్రి  గుర్తు చేశారు. పుల్వామా దాడి జరిగిన 10-12 రోజుల వరకు తమ ప్రభుత్వం వేచి చూసిందని, ఆ తర్వాత కూడా మరో ఆత్మాహుతి దాడి జరగవచ్చునన్న ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు బాలాకోట్‌లో ఉగ్ర శిబిరాలపై వైమానిక దాడులు జరిపిన విషయాన్ని ఆమె వెల్లడించారు.