బీజేపీలో టిఎంసి ఎమ్యెల్యే అర్జున్ సింగ్

తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత, నాలుగు సార్లు ఎమ్యెల్యేగా గెలుపొందిన అర్జున్ సింగ్ ఆ పార్టీకి రాజీనామా చేసి గురువారం బీజేపీలో చేరారు. లోక్ సభ అభ్యర్థుల జాబితాలో పార్టీపై విమర్శలు కురిపిస్తున్న దినేష్ త్రివేదికి తిరిగి బారాకపోర్ సీట్  ఇవ్వడం, తనకు నిరాకరించడం పట్ల అసంతృప్తితో పార్టీకి దూరం అయ్యారు.

బిజెపి ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గీయ, మాజీ టిఎంసి నేత ముకుల్ రాయ్ ల సమక్షంలో ఢిల్లీలోని బిజెపి కార్యాలయంలో ఆ పార్టీలో చేరారు. తాను మూడు దశాబ్దాలుగా మమతా బెనర్జీ కోసం పనిచేస్తున్నానని చెబుతూ పుల్వామా ఉగ్రదాడి అనంతం ఆమె ప్రకటనలు మొత్తం దేశాన్ని షాక్ కు గురి చేశాయని విమర్శించారు. భద్రతాదళాల ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న భాత్పరా అసెంబ్లీ నియోజకవర్గంలోనే కాకుండా మొత్తం బర్రాక్పోరా లోక్ సభ నియోజకవర్గ పరిధిలో అర్జున్ సింగ్ కు మంచి పలుకుబడి ఉంది. ప్రస్తుత ఎంపీ దినేష్ సింగ్ గెలుపుకోడం విశేషంగా కృషి చేశారు. ఈ నియోజకవర్గంలో సుమారు 56 శాతం మంది హిందీ మాట్లాడే ఓటర్లలో సింగ్ కు మంచి పలుకుబడి ఉంది. వారిని టిఎంసి వైపు మొగ్గు చూపేటట్లు చేయడంలో కీలక పాత్ర వహించారు. 

అర్జున్ సింగ్  ఇప్పుడు బిజెపిలో చేరడంతో ఇక్కడి నుండి టిఎంసి ఎంపీ గెలుపొందడం అసాధ్యం కాగలదు. ఈ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఎమ్యెల్యేలు అందరితో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. లోక్ సభ అభ్యర్థుల జాబితా ప్రకటన తర్వాత టిఎంసి నాయకత్వం పలు జిల్లాల నేతల నుండి తీవ్ర అసంతృప్తిని ఎదుర్కొంటున్నది. దానితో మొత్తం 42 సీట్లను గెలుపొందాలని లక్ష్యం చేరుకోవడం దుర్లభం అయ్యే అవకాశం ఉంది. 

రాష్ట్రంలో ఇప్పటి వరకు ముగ్గురు టిఎంసి ఎంపీలు - ముకుల్  రాయ్, సౌమిత్ర ఖాన్, అనుపమ్ హాజరే బీజేపీలో చేరారు. మరింత మంది ఈ ఎన్నికల సమయంలో బీజేపీలో చేరే అవకాశం ఉంది. పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తూ "పార్టీని విడిచే వారెవరైనా ఉంటె విడవవచ్చు" అంటూ మమతా చేసిన ప్రకటన ఆమెలో నెలకొన్న అసహనాన్ని వెల్లడి చేస్తుంది.