బిజెపిలో కాంగ్రెస్ సీనియర్ నేత వాడక్కమ్

ఒక వంక కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళలో పార్టీ ఎన్నికల ప్రచారంలో ఉన్న సమయంలో ఆ రాష్త్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, జాతీయ అధికార ప్రతినిధి టామ్ వడక్కమ్ ఢిల్లీలో భారతీయ జనతా పార్టీలో చేరారు. బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా వడక్కమ్‌కు కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. రక్షణ దళాలపై కాంగ్రెస్ పార్టీ చేసిన అనుచిత ఆరోపణలతోనే తాను బీజేపీలో చేరినట్లు ఈ సందర్భంగా వడక్కమ్ ప్రకటించారు.

వడక్కమ్, కేరళకు చెందిన కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత. 20 ఏళ్లుగా ఏఐసీసీ మీడియా విభాగంలో సేవలు అందిస్తున్నారు. సోనియా గాంధీకి సన్నిహితంగా పనిచేశారు. కాగా తాజా వాయు దాడులపై కాంగ్రెస్ పార్టీ వైఖరి తనకు విస్మయం కలిగించడంతో పార్టీలో ఇమడలేక బయటికి వచ్చానని వడక్కమ్ పేర్కొన్నారు. అంతే కాకుండా బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ప్రశంసల వర్షం కురిపించారు.

‘‘పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు దేశంపై దాడులు చేస్తోంది. దానికి భారత మిలిటరీ తగిన సమాధానం చెప్పింది. కానీ, కాంగ్రెస్ పార్టీ వాటిపై ప్రశ్నలు వేసింది. ఇలాంటి పార్టీని వీడడంలో తప్పేం లేదు. అంతే కాకుండా ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారు. అమిత్‌షా నాపై ఎంతో నమ్మకంతో పార్టీలోకి ఆహ్వానించారు’’ అని వడక్కమ్ పేర్కొన్నారు.