పోలవరం ముడుపులపై చంద్రబాబును రాయపాటి బ్లాక్ మెయిల్ !

నరసరావుపేట లోక్ సభ సీట్ ను తిరిగి రాయపాటి సాంబశివరావుకు ఇవ్వరాదని నిర్ణయించుకున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చివరి నిముషంలో మనసు మార్చుకొని, తిరిగి ఆయన పేరునే ఖరారు చేయడం టిడిపి వర్గాలలో విస్మయం కలిగిస్తున్నది. రెండు రోజుల క్రితం రాయపాటి వెళ్లి కలవగానే సీట్ ఖరారు కావడం విషయం. 

వయస్సు, అనారోగ్యం, ఆర్ధిక ఇబ్బందులను కారణంగా చూపి రాయపాటికి సీట్ ఇవ్వకుండా ఇతర అభ్యర్థుల కోసం అన్వేషణ మొదలు పెట్టారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు లేదా మంత్రి సిద్ద రాఘవరావును ఇక్కడి నుండి పోటీ చేయించాలని ప్రయత్నం చేయడంతో రాయపాటి ఆగ్రహంతో ఊగిపోయారు. ముఖ్యమంత్రిని కలిసి ఈ విషయమై ఒక అల్టిమేటం ఇచ్చిన్నట్లు చెప్పుకొంటున్నారు. 

గత నెలలో, పట్టభద్రుల నియోజకవర్గం నుండి శాసనమండలికి పోటీ చేయడం కోసం గత ఆరేడు నెలలుగా ఓటర్లను చేర్పిస్తూ సిద్దమైన ఆయన తమ్ముడు, మాజీ జిల్లా పరిషద్ చైర్మన్ రాయపాటి శ్రీనివాస్ కు కూడా మొండి చేయి చూపించారు. `మనకు బలం లేదు. గెలవలేము' అంటూ అసలు అభ్యర్థినే నిలబెట్టలేదు. ఆటలాంటిది ఇప్పుడు తిరిగి నరసరావుపేట సీట్ ఇవ్వడానికి కారణం పోలవరం ప్రాజెక్ట్ ముడుపుల వ్యవహారాన్ని బైట పెడతానని రాయపాటి బెదిరించడమే కారణంగా చెబుతున్నారు. 

పోలవరం ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్‌ను రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ (జేవీ) రూ.4,054 కోట్లకు మార్చి 3, 2013న కాంగ్రెస్ ప్రభుత్వం నుండి దక్కించుకుంది. సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో ఏమాత్రం అనుభవం లేని ట్రాన్స్‌ట్రాయ్‌కు పోలవరం పనులు ఎలా అప్పగిస్తారని అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ అధిష్టానం భారీగా ముడుపులు తీసుకొనే అప్పగించారణై కూడా దుయ్యబట్టారు. 

అయితే 2014 ఎన్నికలకు ముందు రాయపాటిని టిడిపిలో చేర్చుకొని నరసరావుపేట సీట్ ఇచ్చారు. పైగా అధికారమలోకి వచ్చాక ఆ కాంట్రాక్టు ను అట్లాగే కొనసాగించడమే కాకుండా హెడ్‌ వర్క్స్‌ అంచనా వ్యయాన్ని రూ.5,535.41 కోట్లకు పెంచేశారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో ఏ మాత్రం పురోగతి లేకపోవడంపై అక్టోబర్, 2017లో కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ సంస్థపై కేంద్రం వేటు వేస్తోందేమోననే భయంతో రాయపాటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో సమావేశమై చంద్రబాబు ముడుపుల వ్యవహారం అంతా చెప్పేసారు. 

పేరుకు తాను కాంట్రాక్టు అయినా  ట్రాన్స్‌ట్రాయ్‌ని ముందుపెట్టి పనులన్నీ సబ్‌ కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు నేరుగా వసూలు చేసుకున్నారని వివరించారు. అందువల్లనే తమ సంస్థ భారీగా ఆర్ధిక కష్టాలలో చిక్కుకున్నదని మోర పెట్టుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో సమావేశం (2017 అక్టోబర్‌ 17) నిర్వహించిన గడ్కరీ దీనిపై చంద్రబాబును ప్రశ్నించినట్లు తెలిసింది. 

కాంట్రాక్టర్ల నుంచి భారీగా కమీషన్లు వసూలు చేసుకుని, వారిని ఆర్థికంగా దెబ్బతీస్తే పనులు ఎలా చేస్తారని చంద్రబాబును గడ్కరీ నిలదీయడంతో అక్కడున్న అధికారులు అందరు ఆశ్చర్యపోయారు. అయితే ఈ వ్యవహారం బయటపెట్టకుండా రాయపాటిని చంద్రబాబు ఇన్నాళ్లూ కట్టడి చేస్తూ వచ్చారు.