ఈశాన్యంలో 25 స్థానాల్లో 22 చోట్ల పాగాకు బిజెపి వ్యూహం

ఈశాన్య రాష్ట్రాల్లో పాగాకు బిజెపి నేతలు సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. అక్కడి 8 రాష్ట్రాల్లోని 25 లోక్‌సభ సీట్లలో కనీసం 22 సీట్ల కైవసానికి వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో పలు పార్టీల తో పొత్తులు కుదుర్చుకుంటున్నారు. ఈ మేరకు బీజే పీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ రెండు రోజులుగా వివిధ పార్టీలతో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు.

ఏజీపీ లాంటి పాత మిత్రులను మళ్లీ కూటమిలోకి తేవడంలో సఫలమయ్యారు. బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్), ఇండిజీనస్ పీపు ల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్‌టీ), నేషనల్ పీపుల్స్ పార్టీ, నేషనలిస్టు డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ, సిక్కిం క్రాంతికారీ మోర్చా తదితర పార్టీలు/కూటములతో జరిపిన చర్చలు ఫలప్రదమైనట్లు రాంమాధవ్ వెల్లడించారు.  

తాము నార్త్ ఈస్ట్ డెమొక్రటిక్ అలయెన్స్ (ఎన్‌ఈడీఏ) పేరుతో కూటమిగా ఏర్పడ్డామని, చైర్మన్‌గా హిమంత బిశ్వ శర్మ వ్యవహరిస్తారని ఆయన చెప్పారు. ఇదో చారిత్రక దినం. ఈశాన్య రాష్ట్రాల్లోని 25 సీట్లలో మా కూటమి 22 చోట్ల సత్తా చాటుతుంది. మోదీ రెండోసారి ప్రధాని కావడంలో కూటమి కీలకపాత్ర పోషిస్తుంది అని ఫేస్‌బుక్‌లో రాంమాధవ్ పోస్ట్ చేశారు. 

అసోం, నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్ సీఎంలు శర్బానంద సోనొవాల్, నెఫ్యూరియో, కన్రాడ్ సంగ్మా, బిప్లవ్‌కుమార్ దేవ్, ఫెమా ఖండూ, బీరెన్‌సింగ్‌లతో పొత్తులను చర్చించి, ఖరారు చేసినట్లు చెప్పారు. 

పౌరసత్వ బిల్లుపై ఆగ్రహించి దూరమైన మిత్రపక్షం అసోం గణపరిషత్‌తో దోస్తీకి బీజేపీ సై అన్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏజీపీ, బీజేపీ కలిసి అధికార కాంగ్రెస్‌ను మట్టి కరిపించాయి. లోక్‌సభ ఎన్నికల తరుణంలో పౌరసత్వ బిల్లుపై రెండు పార్టీల మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు పొడసూపాయి. 

దీంతో అసోంలోని బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ సర్కారు నుంచి ఏజీపీ వైదొలిగింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు మంత్రులు కూడా బయటకు వచ్చారు. దీంతో పరిస్థితి బీజేపీకి ప్రతికూలంగా మారింది. ఈ నేపథ్యంలో రాంమాధవ్ అక్కడికి చేరుకుని ఏజీపీ నేతలతో సుదీర్ఘ మంతనాలు జరిపి, కూటమిలోకి ఆహ్వానించారు. ఈ ఎన్నికల్లో ఇరుపార్టీలు తిరిగి కలిసి పోటీ చేయాలని ఒక అవగాహనకు వచ్చాయి.  

. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమే లక్ష్యంగా తమ పార్టీ, ఎన్‌పీపీ, ఎన్‌డీపీపీ, ఏజీపీ, బీపీఎఫ్‌లతో కలిసి అసోం, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్‌ప్రదేశ్‌లలో పొత్తులను కుదుర్చుకుందని ఆయన తెలిపారు. అలాగే త్రిపురలో తమ పార్టీ భాగస్వామిగా ఐపీఎఫ్‌టీ ఉంటుందని చెప్పారు. సిక్కింలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న సిక్కిం క్రాంతి మోర్చాతోనే తమ పొత్తు అని స్పష్టం చేశారు. 

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి షెడ్యూలు విడుదలైనా విపక్షాలకు చెందిన మహాకూటమి ఇంకా చర్చల్లోనే ఉండగా, ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ తమ కూటమి పార్టీలతో పొత్తులను ఖరారు చేసుకుందని ఆయన చెప్పారు. గతంలో కన్నా ఎన్డీఏ కూటమి ఇప్పుడు మరింత పటిష్టంగా ఉందని రామ్ మాధవ్ పేర్కొన్నారు.