బీజేపీకి 300 సీట్లు.. కేశవ్ ప్రసాద్ వౌర్య జోస్యం

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 300 సీట్లు వస్తాయని యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ వౌర్య జోస్యం చెప్పారు. ఉత్తరప్రదేశ్ ఓటర్లు బీజేపీకే ఓటేస్తారన్న ధీమా వ్యక్తం చేశారు. ‘అమేధీ, రాయిబరేలీయే కాదు మొత్తం రాష్ట్రంలోని ఓటర్లందరూ నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. యూపీలోని 80 లోక్‌సభ స్థానాల్లో మెజారికీ సీట్టు మాకే దక్కుతాయి’ అని ఆయన వెల్లడించారు. 

అభివృద్ధి, జాతీయవాదం, పేదరిక నిర్మూలన, అవినీతి నిర్మూలన, ఉగ్రవాదంపై పోరు విషయంలో మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం ప్రపంచంలోనే ముందుందని ఆయన చెప్పారు. ఇవే అంశాలను ఎన్నికల ప్రచారంలోకి తీసువెళ్తామని ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్‌వ్యూలో ఆయన పేర్కొన్నారు. సమాజ్‌వాదీ పార్టీ, బహుజన సమాజ్‌వాదీ పార్టీ కూటమిని అవకాశవాద కూటమిగా ఆయన అభివర్ణించారు. 

స్వార్థ ప్రయోజనాల కోసం ఎస్పీ, బీఎస్పీ, ఆర్‌ఎల్‌డీ జతకట్టాయని డిప్యూటీ సీఎం నిప్పులు చెరిగారు. ప్రియాంక రాజకీయ రంగ ప్రవేశంపై వౌర్య మాట్లాడుతూ ‘యూపీలో ఆమె ప్రభావం ఏమాత్రం ఉండదు. ప్రియాంక ఇంతకుముందు కూడా కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు’ అని తెలిపారు. ఆ విషయాన్ని అంతగా పట్టించుకోవల్సిందేమీ లేదని కొట్టిపారవేసారు. 

ఎన్నికల సందర్భంగా రామమందిర నిర్మాణం అంశం మరుగున పడుతుందన్న కథనాలపై ఆయన స్పందిస్తూ- ‘ఆ అంశం మరుగునపడే సమస్యేలేదు. బీజేపీ వెనకడుగు వేసేదీ లేదు. మా పార్టీ వరకూ అయితే రామాలయ నిర్మాణాన్ని ఎన్నికల అంశంగా చూడడం లేదు. అది ప్రజల విశ్వాసాలకు సంబంధించింది’ అని కేశవ్ ప్రసాద్ వౌర్య స్పష్టం చేశారు.