రాబర్ట్ వాద్రాపై ఎఫ్‌ఐఆర్

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా, హర్యానా మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా, డీఎల్‌ఎఫ్ కంపెనీ, ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్‌లపై హర్యానాలో ఎఫ్‌ఐఆర్ దాఖలైంది. వీరిపై 2008 నాటి గుర్గావ్ భూ కుంభకోణానికి సంబంధించి సెక్షన్లు 120బీ (నేరపూరిత కుట్ర), 420 (మోసం), 460 (ఫోర్జరీ) కేసులు నమోదయ్యాయి.

భూ లావాదేవీలలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సురేందర్‌ శర్మ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు వాద్రా, హుడాతో పాటు డీఎల్‌ఎఫ్, ఓంకారేశ్వర్‌ ప్రాపర్టీస్‌ కంపెనీలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసినట్లు మనేసర్‌ డీసీపీ రాజేశ్‌కుమార్ చెప్పారు. వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ సంస్థ గుర్గావ్‌లో రూ.7.5 కోట్లకు భూమిని కొనుగోలు చేసి, దానిలో కొన్ని మార్పులు చేసిన అనంతరం రూ.55 కోట్లకు అమ్మిందని తెలిపారు.

గుర్గావ్‌లోని 4 గ్రామాల్లో హౌసింగ్‌ కాలనీలు, వాణిజ్య సముదాయాల నిర్మాణానికి హుడా ముఖ్యమంత్రిగా  ఉన్న సమయంలో ఇచ్చిన అనుమతుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలున్నాయి. వీటిపై విచారణకు ఖట్టర్‌ ప్రభుత్వం 2015లో జస్టిస్‌ ధింగ్రా కమిటీ వేసింది. వాద్రాకు చెందిన స్కైలైట్‌ హాస్పిటాలిటీ  2008లో ఓంకారేశ్వర్‌ ప్రాపర్టీస్‌ నుంచి 3.5 ఎకరాల భూమిని రూ.7.50 కోట్లకు కొనుగోలుచేసి, హుడా పలుకుబడితో వాణిజ్య అనుమతులు పొంది ఆ భూమిని డీఎల్‌ఎఫ్‌కు రూ.58 కోట్లకు విక్రయించిందని ఫిర్యాదుదారుడు ఆరోపించారు.

వాద్రా, హుడాలపై అవినీతి నిరోధక చట్టం కింద కూడా కేసులు నమోదు చేసినట్టు డీసీపీ తెలిపారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన భూ కుంభకోణాలపై దర్యాప్తుకు ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఢింగ్రా కమిషన్‌ను నియమించింది. గుర్గావ్‌లో భూ లావాదేవీల ద్వారా వాద్రా రూ.50 కోట్ల మేర లబ్ధి పొందారని ఆ కమిషన్ తేల్చింది.

అయితే ఇది ఎన్నికల సమయం కావడంతో, ప్రజల ద్రుష్టి మళ్ళించడం కోసం ప్రభుత్వం తనకు వ్యతిరేకంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన్నట్లు రాబర్ట్ వాద్రా ఆరోపించారు.  పదేండ్ల పాత కేసులో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. ఇందులో కొత్తేముంది? అని వ్యాఖ్యానించారు.