కాంగ్రెస్ తో పొత్తు లేదన్నా సీట్లు వారికే

తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని బొక్కబోర్లా పడిన టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఏపీలో జాగ్రత్త పడి ఆ పార్టీతో పొత్తు లేదని తేల్చేశారు. అయితే ఆ పార్టీతో లోపాయికారి అవగాహనతోనే అభ్యర్థుల ఎంపిక చేస్తున్నారు. ముఖ్యంగా లోక్ సభ సీట్లలో అత్యధికంగా కాంగ్రెస్ వారినే అభ్యర్థులుగా నిలబెడుతున్నారు. 2014 ముందు కాంగ్రెస్ లో ఉన్నవారు లేదా ఇప్పుడు కాంగ్రెస్ నుండి వచ్చి చేరిన వారికే సంగంకు పైగా సీట్లు కేటా కేటాయిస్తున్నారు. 

2014లో జేసీ దివాకరరెడ్డి, రాయపాటి సాంబశివరావు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, గల్లా జయదేవ్ వంటి ప్రముఖ కాంగ్రెస్ నేతలకు టిడిపి సీట్లు ఇచ్చారు. ఎన్నికల అనంతరం నంద్యాల ఎంపీ  ఎస్పీవై రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు జేసీ కుమారుడికి, జయదేవ్, రాయపాటిలకు సీట్లు ఖరారు చేశారు. మాగుంట పార్టీ మారే యోచనలో ఉండడంతో సీట్ ఇవ్వలేక వాపోతున్నారు. ఇక కాంగ్రెస్ నుండి చేర్చుకున్న కోట్ల సూర్యప్రకాశరావు, కిషోర్ చంద్రదేవ్ లకు సీట్లు ఇచ్చారు. 

తిరుపతిలో పనబాక లక్ష్మి, మచిలీపట్నంలో వంగవీటి రాధాకృష్ణలకు సీట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. వీరే కాకుండా బాపట్లలో జెడి శీలం, అనకాపల్లిలో కొణతాల రామకృష్ణ, అమలాపురంలో హర్షకుమార్ ల పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. మొత్తం మీద లోక్ సభ సీట్లలో కాంగ్రెస్ టాగ్ ఉంటె టిడిపిలో ప్రాధాన్యత లభిస్తున్నది.