దిల్లీ నుంచి బిజెపి అభ్యర్థిగా గౌతమ్‌ గంభీర్‌ !

 క్రికెట్‌లో తనకంటూ ఓ స్థానాన్ని సంపాందించుకుని చరిత్ర గుర్తుపెట్టుకునేలా ఆడి దేశానికి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిన గౌతమ్‌ గంభీర్‌ ఈ ఎన్నికల్లో న్యూదిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థిగా  పోటీకి దిగనున్నట్లు తెలుస్తున్నది. 37 ఏళ్ల ఈ పద్మశ్రీ పురస్కార గ్రహీత ప్రఖ్యాత న్యూదిల్లీ నుంచి పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బిజెపి ఎంపీ మీనాక్షి లేఖికి వేరొక సీటు కేటాయించే యోచనలో బిజెపి వర్గాలు ఉన్నట్లు చెబుతున్నారు . 

 2014 సార్వత్రిక ఎన్నికల్లో అమృత్‌సర్‌లో బిజెపి అభ్యర్థిగా బరిలో నిలిచిన అరుణ్‌ జైట్లీ ప్రచార కార్యక్రమాల్లో గంభీర్‌ చురుగ్గా పాల్గొన్నాడు. అయితే ఆ ఎన్నికల్లో జైట్లీ అప్పటి కాంగ్రెస్‌ అభ్యర్థి, ప్రస్తుత పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. దాదాపు 15 సంవత్సరాలు భారత క్రికెట్‌ జట్టులో ఆడిన గంభీర్‌ మంచి ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఆటకు గుడ్‌బై చెప్పిన అతను ప్రస్తుతం క్రికెట్‌ వ్యాఖ్యాత(కామెంటర్‌)గా వ్యవహరిస్తున్నారు. 

రాజకీయాల్లో నెలకొన్న పరిస్థితులపై సామాజిక మాధ్యమం వేదికగా ఆయన గళం విప్పుతుంటారు. ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని ట్విటర్‌ వేదికగా ఖండించి దేశభక్తిని చాటుకున్నారు. ఆ దాడిలో అమరులైన జవాన్ల పిల్లలను చదివిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌, ఆప్‌ల మధ్య సఖ్యత కుదరని నేపథ్యంలో గంభీర్‌ పోటీకి దిగడం బిజెపికి కలిసొచ్చే అంశంగా ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. 

గంభీర్‌ రాజకీయాల్లోకి అడుగుపెడితే క్రికెట్‌ నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టి విజయ పథంలో పయనించిన కీర్తి ఆజాద్‌, మహమ్మద్‌ అజారుద్దీన్‌, నవజోత్‌ సిద్దు మాదిరిగా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తారని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.