తపాలా ‘చెల్లింపుల బ్యాంక్’ ప్రారంచించిన ప్రధాని

దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌గా అవ‌త‌రించ‌నున్న పోస్ట‌ల్ పేమెంట్ బ్యాంకును శనివారం  ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో ప్రారంభించారు. దేశంలోని సుదూర ప్రాంతాలకు వేగంగా బ్యాంకింగ్‌ సేవలకు తీసుకెళ్లు ప్రణాళికలో భాగంగా ఇండియా పోస్టు పేమెంట్స్‌ బ్యాంకు (ఐపీపీబీ)ను ప్రధాని లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రతిరోజూ పోస్ట్‌ మ్యాన్‌లు విస్తృతమైన సేవలందించారంటూ  ప్రధాని ప్రశంసించారు. ఇప్పటివరకూ ఉత్తరాలు, పార్సిళ్లను వారు చేరవేశారని, ఇపుడిక పోస్ట్‌మాన్ల ద్వారా బ్యాంకింగ్‌ సేవలు వినియోగదారుల ముంగిటకు వచ్చేశాయని పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ప‌నిచేస్తున్న పోస్ట్‌మెన్లు ఇంటి వ‌ద్దే పోస్ట‌ల్ బ్యాంకింగ్ సేవ‌ల‌ లభించనున్నాయి. ఇండియా పోస్ట్‌ దీంతో ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ ఐపీపీబీ నుంచి పొదుపు ఖాతాలు, క‌రెంట్ ఖాతాలు, న‌గ‌దు బ‌దిలీలు, ప్ర‌త్య‌క్ష న‌గ‌దు బ‌దిలీ, బిల్లు, యుటిలిటీ చెల్లింపులు, వ్యాపార చెల్లింపులు వంటి సేవ‌లు అందుబాటులోకి రానున్నాయి.

దీంతో దేశవ్యాప్తంగా 650 శాఖలు, 3250 యాక్సెస్ పాయింట్లలో ఖాతాదారుల ఇళ్ల వద్దకే బ్యాంకింక్‌ ఫైనాన్షియల్ సర్వీసులను అందుబాటులోకి రానున్నాయి. దేశంలోని 1.55 పోస్టాఫీసు శాఖలను ఐపిపిబితో అనుసంధానం డిసెంబర్ 31 నాటికి పూర్తికానుంది.

ఐపీపీబీ రైతులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని, సుకన్య సమృద్ధి యోజనను విస్తరించడానికి ఈ బ్యాంకులు దోహదపడతాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేసారు. దేశవ్యాప్తంగా ఉన్న తపాలా కార్యాలయాలు, దాదాపు 3 లక్షల మంది గ్రామీణ తపాలా సేవకుల ద్వారా ఈ సేవలు ప్రజలకు అందుతాయి. రుణాలివ్వడం మినహా మిగతా కార్యకలాపాలన్నీ ఇతర బ్యాంకుల కార్యకలాపాల మాదిరిగానే ఉంటాయి.

అయితే ఇవన్నీ స్వల్ప స్థాయిలో జరుగుతాయి. ఐపీపీబీలు డబ్బు జమ చేసుకుంటాయి కానీ రుణాలివ్వవు, క్రెడిట్ కార్డులను జారీ చేయవు. ఐపీపీబీ ఖాతాదారులు రూ.1 లక్ష వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. మొబైల్ పేమెంట్స్, ట్రాన్స్‌ఫర్స్, పర్చేజెస్ చేసుకోవచ్చు. ఏటీఎం/డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్, థర్డ్ పార్టీ ట్రాన్స్‌ఫర్స్ వంటి సదుపాయాలు పొందవచ్చు.