కాంగ్రెస్ ను రద్దు చేయాలనుకున్న గాంధీజీ !

మహాత్మా గాంధీ 1947 తరవాత కాంగ్రెస్‌ పార్టీని రద్దు చేయాలనుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. స్వతంత్ర సంగ్రామంలో కీలక ఘట్టంగా చెప్పుకునే ‘దండి మార్చ్‌’ 89వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే గాంధీతో పాటు దండి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నవారందరికీ ఆయన నివాళులర్పించారు. 

భారతీయుల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి జరిగిన గొప్ప ఉద్యమంగా దీనిని అభివర్ణించారు. అలాగే ఈ ఉద్యమంలో సర్దార్‌ పటేల్‌ కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ గాంధీ సిద్ధాంతాలకు పూర్తి విరుద్ధంగా నడుచుకుంటుందని ఆరోపించారు. అసమానతలు, ప్రజల మధ్య విభజనను గాంధీజీ పూర్తిగా వ్యతిరేకించారని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్‌ మాత్రం సమాజాన్ని విభజించడానికి ఏమాత్రం వెనకాడట్లేదని ధ్వజమెత్తారు. 

కీలకమైన ఎన్నికల వ్యూహాన్ని రూపొందించేందుకు అహ్మదాబాద్ లోని సబర్మతి ఆశ్రయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతున్నా సమయంలో ప్రధాని ఈ వాఖ్యలు చేయడం గమనార్హం. గాంధీ చూపిన మార్గంలో బిజెపి  పయనిస్తోందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ అవినీతికి మారుపేరుగా మారిందని ఆరోపించారు. బిజెపి మాత్రం అవినీతిపరుల ఆటకట్టించడంపై దృష్టి సారించిందని తెలిపారు. ఎమర్జెన్సీ పేరిట కాంగ్రెస్‌ నాయకులు రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారని ప్రధాని దుయ్యబట్టారు.