24 గంటల్లో కర్ణాటక ప్రభుత్వాన్ని కూల్చేస్తాం..!


లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ 22 సీట్లు గెలిచిన 24 గంటల్లో కర్ణాటక ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ కర్ణాటక బిజెపి అధ్యక్షుడు బిఎస్ యడ్యూరప్ప  హెచ్చరికతో కూడిన సవాల్‌ విసిరారు. బిజెపి ఇప్పటికే దీనిపై కసరత్తు మొదలు పెట్టిందని ఆయన వెల్లడించారు.  

బెళగావి జిల్లాలోని యారగట్టిలో  పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ  ‘ కన్నడ నాట బిజెపి  ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇంకెంతో సమయం పట్టదు. నేను ఈ మాటను గర్వంతోనో, పార్టీ బలం చూసుకునో చెప్పడం లేదు. లోక్‌ సభ ఎన్నికల్లో బిజెపి 22 సీట్లు గెలిస్తే..ఆ మరుసటి రోజే కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి ప్రభుత్వాన్ని దించేస్తాం" అని వెల్లడించారు. "ఇప్పుడు మా ముఖ్యమంత్రి కుమార స్వామి ఇక ఎన్నోరోజులు కొనసాగబోరు. కర్ణాటకలోని 6.5కోట్లమంది ప్రజలు కుమార స్వామి ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. దాన్ని పోగొట్టాలంటే ఒక్క బిజెపి వల్లనే సాధ్యం" అని స్పష్టం చేశారు. 

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వాలు సరిగా అమలు చేయడం లేదని విమర్శించారు. ఇక్కడున్న 28లోక్‌ సభ స్థానాల్లో గెలవడంపై తాము దృష్టి సారించామని చెబుతూ  దీన్ని బాధ్యతగా తీసుకున్నామని చెప్పారు. 

ఇలా ఉండగా, కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌.డి. కుమారస్వామి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని.. ప్రజా శ్రేయస్సు కోసం కాకుండా కేవలం తన కుటుంబ స్వలాభం కోసమే పనిచేస్తున్నారని కర్ణాటక బీజేపీ శాఖ ఆరోపించింది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మండ్య లోక్‌సభ స్థానం నుంచి తన కుమారుడైన నిఖిల్‌ కుమారస్వామిని నిలబెట్టాలని ఆయన ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కర్ణాటక బిజెపి శాఖ ఈ మేరకు ఎదురుదాడికి దిగింది. 

అధికారం చేపట్టిన ఎనిమిది నెలల్లో మొదటి రెండు నెలలు ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు.. తర్వాతి రెండు నెలలు తన భార్యను ఎలా గెలిపించుకోవాలి అనే ఆలోచన.. ఐదు, ఆరు నెలల్లో తన కుమారుడి సినిమా ప్రచారం.. చివరి రెండు నెలల్లో కొడుకుని ఎలా ఎంపీ చేయాలి.. ఇలా కుటుంబ అవసరాల కోసమే తప్ప ప్రజల కోసం పనిచేయడం లేదంటూ మండిపడింది. ప్రస్తుతం కుమార స్వామి భార్య అనిత రామనగర నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు.

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో దివంగత నటుడు అంబరీష్‌ భార్య నటి సుమలత మండ్య స్థానం నుంచి బరిలోకి దిగనున్నారు. తన మిత్రపక్షం అయిన జనతాదళ్‌(సెక్యూలర్‌)కు చెందిన వారే మండ్య స్థానం నుంచి పోటీకి దిగుతారని కాంగ్రెస్‌ ఇప్పటికే ప్రకటించింది. అయితే సుమలత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా లేదా బిజెపి తరఫున బరిలో దిగుతారా అనే విషయం తేలాల్సి ఉంది. 

మండ్యలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించిన జేడీఎస్‌కు ఈ ప్రాంతంలో మంచి‌ పట్టు ఉంది. అంబరీష్‌కు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజాదరణతో సుమలత గట్టి పోటీ ఇవ్వనున్న నేపథ్యంలో జేడీఎస్‌ ఈ పోటీని సవాలుగా తీసుకుంది. మరోపక్క కొన్ని రోజుల క్రితం కుమారస్వామి కొడుకు నిఖిల్‌కు వ్యతిరేకంగా ‘నిఖిల్‌ గోబ్యాక్‌’ అంటూ సామాజిక మాధ్యమాల్లో జోరుగా వ్యతిరేఖ జ్వాలలు వీస్తున్నాయి.