డేటా చోరీ చేసిన టిడిపిని రద్దు చేయాలి : జగన్

ప్రజల వ్యక్తిగత డేటాను చోరీ చేసినందుకు టీడీపీని రద్దు చేయాలని   వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు , ప్రతిపక్ష నేత  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి    డిమాండ్‌ చేశారు.  కాకినాడలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమరశంఖారావం భారీ బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగిస్తూ  ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించిన డేటా చోరీ కేసులో చంద్రబాబు తీరును ఎండగట్టారు. 

చంద్రబాబు ఒక సైబర్‌ క్రిమినల్‌ అని వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. టీడీపీ యాప్‌ను రూపొందించిన ఐటీ గ్రిడ్స్‌ సంస్థ డేటాను చోరీ చేయడంపై ప్రజల్లో చర్చ జరగాలని కోరుతూ  ప్రజల డేటాను ప్రైవేటు సంస్థకు అప్పగించడానికి చంద్రబాబు ఎవరు అని వైఎస్‌ జగన్‌ నిలదీశారు. తూర్పుగోదావరి జిల్లా నుంచే మార్పునకు నాంది పలుకుతూ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

 రాష్ట్రంలో ప్రజలను వంచించి, హింసించిన దోపిడీ ప్రభుత్వాన్ని సమాధిచేసి, మార్పును తీసుకురావడానికి ఓటు వేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. రాజన్న రాజ్యం కోసం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి తమకు ఒక్క అవకాశమివ్వాలని 

రాష్ట్ర ప్రజల రహస్య సమాచారాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక సైబర్ క్రిమినల్ అని, ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తమ సమాచారం ప్రైవేటు సంస్థలకు ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఎవరని ప్రజలంతా నిలదీయాలని చెప్పారు. ఇంటెలిజెన్స్ అధికారులు రాష్ట్రాన్ని కాపాడటానికి కాక, చంద్రబాబును కాపాడటానికి వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజల డేటాను ప్రైవేటు సంస్థకు విక్రయించిన చంద్రబాబు నేడో రేపో జైలుకు వెళ్లడం ఖాయమని స్పష్టం చేశారు. 

నాలుగేళ్లు కేంద్ర ప్రభుత్వంలో ఉండి, ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టిన చంద్రబాబు ఎన్నికల ముందు మరోసారి ప్రత్యేక నాటకానికి తెరతీశారని ఆరోపించారు. రైతు రుణమాఫీ పేరుతో మంజూరుచేసిన మొత్తం వడ్డీలకు కూడా సరిపోదని ధ్వజమెత్తారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తానని హామీయిచ్చి, ఎన్నికలకు మూడు నెలల ముందు మూడు లక్షల మందికి రూ.1000 వంతున భృతి పేరుతో చేస్తున్న మోసాన్ని అందరూ గ్రహించాలని కోరారు. 

మట్టి, ఇసుక, బడి, గుడి భూముల తేడా లేకుండా కాజేస్తున్నారని ప్రతిపక్షనేత మండిపడ్డారు. రాజధాని అమరావతి పేరుతో 50 వేల ఎకరాలు తీసుకుంటే అందులో 49 వేల ఎకరాల్లో గడ్డి మినహా ఏమీ లేదని జగన్ ధ్వజమెత్తారు. నిర్మించిన తాత్కాలిక భవనాల్లో వర్షం కురుస్తోందని చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్ వస్తోందని తెలుసుకుని, చరిత్రలో లేని విధంగా కేబినెట్ సమావేశాలు ఏర్పాటుచేసి, బినామీలకు భూములు కట్టబెడుతున్నారని దయ్యబట్టారు. 

రాష్ట్రంలో 59లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని, వాటిని తొలగించాలని ఫారం-7లో దరఖాస్తు చేస్తే, అదికూడా తప్పుగా చిత్రీకరిస్తూ వైసీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని జగన్ ఆవేదన వ్యక్తంచేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసులన్నీ ఎత్తివేస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి చేస్తున్న అక్రమాలతోపాటు ఆయనకు వంతపాడుతున్న ఎల్లో మీడియాతో పోరాటం చేస్తున్నామని ప్రకటించారు. 

ఎన్నికల్లో చంద్రబాబు ఓటుకు రూ.3000 ఇస్తారని, అయితే తమ పార్టీ అధికారంలోకి వస్తే పిల్లలను బడికి పంపితే ఏడాదికి రూ.15వేలు ఇస్తామని ప్రజలకు తెలపాలని జగన్ కార్యకర్తలకు సూచించారు. డ్వాక్రా మహిళల రుణాలను మాఫీచేస్తామని, వడ్డీలేని రుణాలు అందిస్తామని తెలపాలని పేర్కొన్నారు.  ప్రతి రైతుకు ఏటా తొలకరికి ముందుగానే రైతు భరోసాగా రూ.12,500 చెల్లిస్తామని భరోసా ఇచ్చారు. అలాగ వృద్ధాప్య పించను మొత్తాన్ని రూ.3000కు పెంచుతామని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అమలుచేసే నవరత్నాలతో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతామని హామీ ఇచ్చారు.