వ్యాధుల వ్యాప్తి పట్ల చంద్రబాబు అసహనం

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రాధమిక వైద్యం పడక వేస్తూ ఉండడంతో వ్యాధులు అదుపు లేకుండా పెరుగుతూ ఉండటం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసహనం వ్యక్తం చేసారు. అందుకు దారితీసిన పరిస్థితులను సవరించే ప్రయత్నం చేయకుండా వ్యాధుల నియంత్రించలేకపోతే కఠిన నిర్ణయాలు తప్పవంతూ అధికారులను హెచ్చరించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే చూస్తూ ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు.

రాష్ట్రంలో కొన్ని చోట్ల అదుపులేకుండా ప్రబలుతున్న అంటువ్యాధులు మలేరియా, డెంగీ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి అధికారులను హెచ్చరించారు. "చెప్పే దానికి చేసే దానికి పొంతన ఉండడం లేదు. గతంలో వ్యాధులు వచ్చిన చోట మళ్లి వ్యాధులు ప్రబలుతున్నాయంటే మీ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరు ఇలాగె వ్యవహరిస్తే ఎలా.. సామాన్యుల ప్రాణాలను పణంగా పెట్టలేను.. " అని ముఖ్యమంత్రి దారుణంగా ఉన్న ప్రాధమిక వైద్య రంగం నెపాన్ని అధికారులపై నెట్టివేసే ప్రయత్నం చేసారు.

ఉండవల్లి ప్రజావేదిక లో జరిగిన వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సమీక్ష సమావేశంలో సాంకేతిక పరిజ్ఞానం ఉందని, కావలసిన సౌకర్యాలు సమకూర్చామని, హాట్ స్పాట్ లు ఏమిటో తెలుసని అంటూ డ్రోన్ లను విస్తృతంగా వినియోగించి ఎక్కడ వ్యాధులు ప్రబలడానికి ఆస్కారం ఉందొ తెలుసుకొని వెంటనే తగు చర్యలు చేపట్టవచ్చని చెప్పారు. అయితే ఆలా జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసారు. అంటే ప్రభుత్వంలో ఎక్కడ ఏమి జరుగుతుందో ముఖ్యమంత్రికి అంతుబట్టడం లేదని భావించ వలసి వస్తుంది.

ప్రజలు మంచాన పడడానికి మూల కారణాలు గుర్తించమని ఆదేశించారు. మవారానికల్లా పూర్తి వివరాలు సమర్పించమని కోరుతూ అప్పటికీ పరిస్థితి నియంత్రణలోకి రాక పోతే తానే ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తానని, అప్పుడు చర్యలు తప్పవని స్పష్తం చేసారు.  మలేరియా కేసులు గత ఏడాది తో పోలిస్తే కొంత తగ్గినప్పటికీ డెంగీ మాత్రం అత్యధిక కేసులు నమోదయ్యాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేసారు.రియల్ టైం గవర్నెన్స్ కూడా అప్రమత్తంగా ఉండీ ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ తగు చర్యాలకు ఉపక్రమించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

కాగా, పారిశుధ్యం, పరిశుభ్రత, నీటి నిల్వ వంటి కారణాలతో అంటు వ్యాధులు ప్రబలుతున్నాయని ప్రజల్లో చైతన్యం కలిగించేలా ఇంకా చర్యలు పెద్ద స్థాయిలో చేపడితే కానీ పరిస్థితి అదుపులోకి రాదనీ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గత ఏడాది తో పోలిస్తే డెంగీ కేసులు 17 శాతం తగ్గినప్పటికే విశాఖపట్నం లో మాత్రం 424 శాతం డెంగీ కేసులు పెరగడమే ఆందోళన కలిగిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.

విశాఖపట్నం, అనంతపురం, గుంటూరు, తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాలు డెంగీ కేసులు అత్యధికంగా నమోదయ్యాయని వివరించారు. 86 శాతం కేసులు ఈ 5 జిల్లాల్లోనే నమోదయ్యాయని చెప్పారు. పరిస్థితి వెంటనే అదుపులోకి తీసుకు రావాలని కోరుతూ ఇదొక అత్యవసర పరిస్థితిగా భావించి సమస్య తమదనుకుని అధికారులు విస్తృతంగా అన్ని ప్రాంతాల్లో తిరగాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.