పుల్వామా తర్వాత పెరిగిన ప్రధాని మోదీ రేటింగ్

పుల్వామా ఘటన’ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ రేటింగ్‌ గణనీయంగా పెరిగిపోయిందని టైమ్స్‌ నౌ, వీఎంఆర్‌ నిర్వహించిన సర్వేలో తేలింది. నెలరోజుల్లోపు సమయంలోనే మోదీ రేటింగ్‌ 7శాతం వరకు పెరిగింది. ప్రజానాడిని పట్టేందుకు ఫిబ్రవరి 5 నుంచి 21 వరకు ఈ సర్వే నిర్వహించారు. 

మోదీ అయితేనే దేశాన్ని మెరుగ్గా నడిపిస్తారని ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 52శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇక 27శాతం మంది రాహుల్‌ గాంధీ పక్షాన నిలిచారు. దాదాపు 7.3శాతం మంది మాత్రం స్థానిక నేతల తరఫున ఉన్నారు. 

ఇటువంటి సర్వేనే జనవరిలో నిర్వహించగా 44.4శాతం మంది మోదీని, 30శాతం మంది రాహుల్‌ను, 13.8శాతం మంది స్థానిక నేతలకు మద్దతు పలికారు. దేశవ్యాప్తంగా 690 ప్రదేశాల్లో 14,431 మందిని అడిగి ఈ సర్వే నిర్వహించారు. 
* రాహుల్‌ గాంధీ నమ్మకమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నారని దాదాపు 43శాతం మంది అభిప్రాయపడ్డారు. 40శాతం మంది మాత్రం దీనిని వ్యతిరేకించారు. 
* మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఎన్నికల హామీలను అతి తక్కువగా నెరవేర్చిందని 46 శాతం వెల్లడించగా.. 27శాతం మంది మాత్రం మద్దతుగా నిలిచారు.
* ఉద్యోగ కల్పనే అతిపెద్ద ఎన్నికల అంశంగా 40శాతం మంది తెలిపారు. 17.7 శాతం మంది మాత్రం వ్యవసాయమని, 14శాతం మంది రామమందిర నిర్మాణం అని పేర్కొనడం గమనార్హం. 
* పీఎం -కిసాన్‌ సమ్మాన్‌ నుంచి పెద్దగా ఉపయోగం లేదని 30శాతం మంది అభిప్రాయపడ్డారు.