16 సీట్లు గెలిచి ఏంచేస్తావ్ కేటీఆర్ : దత్తాత్రేయ

కొన్ని రోజులుగా 16 ఎంపీ సీట్లను గెలుస్తామంటూ టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఊదరగొడుతున్నారని చెబుతూ 16 సీట్లు గెల్చుకొని ఏమి చేస్తారని  కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ ప్రశ్నించారు. కేసీఆర్ ను ప్రధానమంత్రి చేస్తారా అని ఎద్దేవా చేశారు. అసలు ముందుగా మీ  ప్రధాన మంత్రి అర్థి ఎవ్వఎవరెన్ని కుట్రలు పన్నినా నరేంద్ర మోదీనే మరోసారి ప్రధాని అవుతారని ఉద్ఘాటించారు. 

‘కేటీఆర్‌! ప్రతి వేదిక నుంచి పదహారు ఎంపీ సీట్లు గెలుచుకుందాం అంటున్నావ్‌. ఆ సీట్లు సాధించి ఏం చేస్తావ్‌? ప్రయోజనం ఏమిటి? కేసీఆర్‌ ఏమైన ప్రధాన మంత్రి అవుతారా?’ అని ప్రశ్నించారు.   బీజేపీ, ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని  కేశవ మెమోరియల్‌ గ్రౌండ్స్‌లో జరిగిన బీసీల ఆత్మగౌరవ సభలో దత్తాత్రేయ బీజేపీ ఎన్నికల సమర శంఖాన్ని పూరించారు.

రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కచ్చితంగా 300 సీట్లు గెలుచుకుంటుందని దత్తాత్రేయ భరోసా వ్యక్తం చేశారు. రాహుల్‌, చంద్రబాబు, మమతాబెనర్జీ, లాలూప్రసాద్‌, వామపక్షాలు అంతా కలిసి వచ్చినా మోదీని ఆపే శక్తి ఎవరికీ లేదని స్పష్టం చేశారు. 

ఎవరెన్ని కుట్రలు పన్నినా నరేంద్ర మోదీనే మరోసారి ప్రధాని అవుతారని ఉద్ఘాటించారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా విద్య, ఉద్యోగాల్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నా రు. కొన్ని సంవత్సరాల పాటు కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుందని ఆరోపించారు. మోదీ ప్రధాని అయ్యాక కొద్ది రోజులకే కమిషన్‌ను ఏర్పాటు చేసి, దానికి అన్ని అర్హతలు కల్పించారని గుర్తు చేశారు.  

తెలంగాణ ప్రభుత్వం సొమ్మొకడిది.. సోకొకడిది అన్నట్లుగా వ్యవహరిస్తోందని చెబుతూ  కేసీఆర్‌ కిట్లకు కేంద్ర ప్రభుత్వం రూ.6 వేలు ఇస్తున్న విషయాన్ని బయటకు చెప్పడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిద్ధంగా లేరని ధ్వజమెత్తారు. 

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ మజ్లిస్‌తో స్నేహం చేస్తూ విచిత్రమైన రాజకీయాలకు తెరలేపుతోందని విమర్శించారు. రానున్న ఎన్నికలలో ప్రజలంతా ఒక్కటై బీజేపీకి అత్యధిక ఎంపీ సీట్లు గెలిపించి మోదీని ప్రధానిని చేయాలని పిలుపునిచ్చారు. 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. మోదీ బీసీ కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న బీసీలపై ఆయన మమకారం చూపించారని చెప్పారు. కులం రంగు పులుముకోకుండా అగ్రకులస్తులకు కూడా రిజర్వేషన్లు కల్పించిన ఘనత మోదీదే అని కొనియాడారు. 

పార్లమెంట్‌ ఎన్నికల్లో అన్ని సీట్లు తమవే అంటూ కేటీఆర్‌ ఉత్తర కుమారుడిలా ప్రగల్భాలు పలుకుతున్నారని మాజీ ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.