ఏళ్లుగా ఉగ్రవాదం భరించాం. ఇక ఊరుకునే ప్రసక్తే లేదు


‘అయిందేదో అయింది. ఏళ్లుగా భరించాం. ఇక ఊరుకునే ప్రసక్తే లేదు’అని అంటూ ఉగ్రవాదంపై  ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారత్‌ లక్ష్యంగా జరుగుతున్న ఉగ్రకుట్రలకు తగిన గుణపాఠం చెప్పి తీరతామని హెచ్చరించారు. 

ఢిల్లీలో జరిగిన కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాల (సీఐఎస్‌ఎఫ్‌) 50వ వ్యవస్థాపక దినోత్సవంలో  ప్రధాని పాల్గొంటూ దేశ భద్రతను కాపాడుతున్న సీఐఎస్‌ఎఫ్‌ జవాన్ల కృషి అభినందనీయమని కొనియాడారు. స్వాతంత్య్రం అనంతరం దేశం కోసం ప్రాణాలర్పించిన 35 వేల మంది పోలీసుల్లో పాలమిలటరీ దళాలకు చెందిన వారు 4 వేల మంది ఉన్నారని పేర్కొ న్నారు. 

వీరి శౌర్యం, అంకితభావం ప్రజలందరికీ ఆదర్శనీయమని ప్రశంసించారు. ఉగ్రదాడులకు వ్యతిరేకంగా తమ ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. పుల్వామా ఉగ్రదాడికి వ్యతిరేకంగా పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై వైమానిక దాడులకు పాల్పడిన విషయాన్ని ప్రస్తావీస్తూ దేశ ప్రజల మద్దతుతోనే ఇదంతా సాధ్యమైందని పేర్కొన్నారు. 

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమ ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకొచ్చిందని తెలిపారు.  ఉగ్రదాడు లను సమర్థంగా ఎదుర్కొనేందుకు అధునాతన గాడ్జెట్లను కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ఇక వీఐపీ సంస్కృతిపై మోదీ విమర్శల వర్షం కురిపించారు. వీఐపీలకు భద్రతను అందించే సీఐఎస్‌ఎఫ్‌ బలగాలతో వారు వ్యవహరించే తీరు దారుణంగా ఉంటోం దని విచారం వ్యక్తం చేశారు.  సీఐఎస్‌ఎఫ్‌ జవాన్ల గురించి ప్రజలకు తెలిసేలా వారి చరిత్ర, విధివిధానాలతో డిజిటల్‌ మ్యూజియాలను ఏర్పాటు చేయాలని సూచించారు.