చంద్రబాబుపై ప్రజా దర్బార్లో బిజెపి ‘చార్జీషీట్’

రాష్ట్రంలో జరుగుతున్న చంద్రబాబు నాయుడు అవినీతి, అక్రమ, బంధుప్రీతి, అనైతిక పాలనకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచే దిశగా ‘చార్జీషీట్’ను ప్రజా దర్బారులో దాఖలు చేయాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది. తిరుపతిలో ఆదివారం ప్రారంభమైన రెండు రోజుల రాష్ట్ర కార్యవర్గ సమావేశాలలో ఆమోదీయించిన తీర్మానంలో అందుకోసం ఒక కమిటీ ఏర్పాటు చేశారు.

తనను నమ్మిన ప్రధాని నరేంద్ర మోదీని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తన సహజ మోసపూరిత గుణంతో చంద్రబాబునాయుడు విశ్వాస ఘాతుకానికి ఒడిగట్టారని బిజెపి మండిపడింది. చంద్రబాబునాయుడి ఐదేళ్ల పాలన పూర్తిగా అవినీతిమయమని, ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గం స్పష్టం చేసింది. రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు.   

2014లో రాష్ట్ర విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో జరిగిందని, ఈ నేపథ్యంలో అభివృద్ధికి మారుపేరైన నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీతో పొత్తు పెట్టుకుని టీడీపీ ప్రజల ఆదరణతో అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు.  పాలకుడు ప్రాణం పోయినా ప్రజల విశ్వాసాన్ని కోల్పోరాదని, అయితే బాబు తన ఐదేళ్ల పాలనలో సంపూర్ణంగా ప్రజా విశ్వాసాన్ని కోల్పోయారని బిజెపి వెల్లడించింది.  తనకు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకున్న బాబు రాష్ట్ర ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవడంలోను, రాష్ట్రానికి దశ, దిశ నిర్దేశం చేయడంలోను పూర్తిగా విఫలమయ్యారని బిజెపి విమర్శించింది.  

నిమిషానికో మాట యూ టర్న్ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు తన అరాచక, అవినీతి పాలనతో ప్రజావిశ్వాసం కోల్పోయారరు. దేశంలో అవినీతి రహిత పాలనను దేశ ప్రజలకు ప్రధాని మోదీ అందిస్తే, రాష్ట్రంలో తిన్నవారికి తిన్నంత అనే రీతిలో అవినీతిని ప్రోత్సహిస్తూ బాబు పాలన సాగించారని బిజెపి దుయ్యబట్టింది. సూర్యుడు ఉదయించే రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి బదులు, తన పుత్రుడి పురోభివృద్ధికి రాష్ట్రాన్ని బాబు వాడుకున్నారని ఆరోపించింది. 

నవ్యాంధ్రను సంక్షేమ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి బదులు జన్మభూమి కమిటీలకు చేయి తడిపితే తప్ప అర్హులైన వారికైనా సంక్షేమం అందదన్న చందంగా పాలన సాగించారని బీజేపీ నిశితంగా విమర్శించింది. చివరకు కేంద్రం రాష్ట్ర ప్రజలకు అందించిన సంక్షేమాన్ని సైతం తనవిగా చెప్పుకుంటూ స్టిక్కర్ బాబు కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని సమావేశం మండిపడింది. భూబకాసురులు, ఇసుక బకాసురులు రాష్ట్రంలో రెచ్చిపోయి సహజ వనరులను, అటవీ సంపదను దోచేస్తున్నా వారిని శిక్షించడానికి బదులు ప్రోత్సహించడాన్ని బీజేపీ తీవ్రంగా పరిగణించింది. 

ప్రజాధనాన్ని కాపాడటానికి బదులు, తన సొంత హంగులకు, ఆర్భాటాలకు, విలాసాలకు, సభలకు వినియోగించుకోడాన్ని తీవ్రంగా ఖండించింది. రైతే రాజు అన్న సూక్తిని మాటలకే పరిమితం చేస్తూ రైతులను తీవ్ర భయాందోళనలకు గురిచేసిందన్నారు. అభివృద్ధి ముసుగులో ల్యాండ్ పూలింగ్ అనే ఆకర్షణీయమైన పేరుతో రైతుల నుంచి సారవంతమైన భూములను తన సహచరులు, మంత్రులు కబ్జా చేయడం, వ్యాపార ధోరణులతో వాడుకోవడాన్ని సమావేశం తీవ్రంగా ఖండించింది.  

 సమావేశంలో ముఖ్యఅతిథిగా హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్, జాతీయ ప్రధానకార్యదర్శి రామ్‌మాధవ్, ఏపీ బీజేపీ ఇన్‌చార్జ్ మురళీధరన్, సహ ఇన్‌చార్జ్ సునీల్ దియోధర్ పాల్గొన్నారు. బిజెపి ఎంపీలు హరిబాబు, జీవిఎల్ నరసింహారావు, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, మాధవ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సత్యమూర్తి, సురేష్‌రెడ్డి, ఉపాధ్యక్షులు విష్ణువర్దన్‌రెడ్డి, జాతీయ నాయకురాలు పురంధ్రీశ్వరి, కృష్ణంరాజు, 13 జిల్లాల పార్లమెంట్, అసెంబ్లీ ఇన్‌చార్జ్‌లు, కన్వీనర్లు, జిల్లా ఇన్‌ఛార్జ్‌లు, కన్వీనర్లు, ఇతర నేతలు పాల్గొన్నారు.