మళ్లీ అధికారంలోకి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో స్వల్పంగా మెజారిటీ తగ్గినా.. ఎన్నికల అనంతర పొత్తులతో మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే(నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్)నే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని తాజా సర్వేలో వెల్లడైంది. కీలకమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో విపక్షాలు మహాకూటమిని ఏర్పాటు చేయకపోతే.. ఎన్డీయే 300కుపైగా లోక్‌సభ స్థానాలు సాధించే అవకాశం ఉందని తేలింది. 

సీఓటర్ తాజాగా నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై వైమానిక దాడులు చేపట్టేలా మోదీ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న వేళ మార్చిలో ఈ సర్వే నిర్వహించారు. మెరుపుదాడుల నేపథ్యంలో ప్రధాని రేసులో మోదీనే ముందంజలో ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 264 సీట్లు, కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ 141 సీట్లు, మిగతా పార్టీలు 138 సీట్లు సాధించే అవకాశం ఉందని సర్వేలో తేలింది. ఉత్తరప్రదేశ్‌లో మహాకూటమి ఏర్పడకపోతే ఎన్‌డీఏ 307 సీట్లు కైవసం చేసుకుంటుందని, యూపీఏ 139 సీట్లకే పరిమితమవుతుందని, ఇతర పార్టీలు 97 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని సీ ఓటర్ సర్వే వెల్లడించింది. 

సీట్ల పరంగా చూస్తే, బీజేపీ సొంతంగా 220 సీట్లు గెలుచుకోనుండగా, దాని మిత్రపక్షాలు 44 సీట్లు సాధించనున్నాయి. ఇక యూపీఏ శిబిరంలో, కాంగ్రెస్ 86 సీట్లు, దాని మిత్రపక్షాలు 55 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉంది. ఎన్నికల అనంతరం యూపీఏ.. ఆలిండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఏఐయుడీఎఫ్), లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్), మహాకూటమి(ఉత్తరప్రదేశ్‌లో), తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలతో జతకలిస్తే యూపీఏ బలం 226కు పెరుగనుంది. 

ఒకవేళ ఉత్తరప్రదేశ్‌లో మహాకూటమి ఏర్పడితే ఆ రాష్ట్రంలో బీజేపీ బలం ప్రస్తుతమున్న 71 స్థానాల (మొత్తం 80 స్థానాలు) నుంచి 21కి తగ్గనుంది. అదే మహాకూటమి లేకపోతే 72 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉంది. మొత్తంగా వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే 31.1 శాతం ఓట్లు, యూపీఏ 30.9 శాతం ఓట్లు, ఇతర పార్టీలు 28 శాతం ఓట్లు సాధించనున్నాయని సర్వే వెల్లడించింది.