విరాట్ కోహ్లికి విశ్రాంతి, కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ

ఈ నెల 15 నుంచి దుబాయ్‌ వేదికగా జరగనున్న ఆసియా కప్‌ బరిలో దిగే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ టోర్నీలో పాల్గొనే టీమ్‌ ఇండియాకు రోహిత్‌ శర్మ నాయకత్వ వహించనున్నాడు. వరుసగా మూడు ఫార్మాట్లు ఆడుతోన్న భారత పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. శిఖర్‌ ధావన్‌ వైస్‌ కెప్టెన్‌ బాధ్యతలు తీసుకోనున్నాడు.

వెన్ను నొప్పితో వరుసగా ఇబ్బందులకు గురవుతున్న విరాట్ వత్తిడులకు లోనవుతూ ఉండడంతో, వచ్చే సంవత్సరం జరుగనున్న ప్రపంచ కప్ కు సిద్దం కావడం కోసం ప్రస్తుతం విశ్రాంతి ఇచ్చిన్నట్లు తెలుస్తున్నది.

ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేసి ఇంగ్లాండ్‌ పర్యటనకు ఎంపికైన హైదరాబాద్ ఆటగాడు అంబటి రాయుడు ఆ తర్వాత యో యో టెస్టులో విఫలమై ఆ పర్యటనకు దూరమయ్యాడు. కొద్ది రోజుల క్రితం యో యో టెస్టులో విజయవంతమైన రాయుడు ఇప్పుడు భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఆడిన ఖలీల్‌ అహ్మద్‌కు తొలిసారి జట్టులో చోటు దక్కింది. ఖలీల్‌ రాజస్థాన్‌కు చెందిన వాడు.